Begin typing your search above and press return to search.

సరదాగా: రోజుకో రంగు అందుకేనంట

By:  Tupaki Desk   |   25 Dec 2015 6:43 AM GMT
సరదాగా: రోజుకో రంగు అందుకేనంట
X
కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు బాగా పేలుతుంటాయి. నిజానికి అందులో ఎలాంటి వాస్తవం లేకున్నా.. సమయానికి తగ్గట్లు చెప్పే ఇలాంటి మాటలు చమత్కారానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీ యాగానికి సంబంధించి ఒక అంశంపై సరదాగా చేస్తున్న వ్యాఖ్యలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. యాగం సందర్భంగా రోజుకో రంగు వస్త్రంతో రుత్వికులు.. యాగస్థలిలో పూజాదికాలు జరిపే ప్రముఖులు సైతం అవే రంగులతో కూడిన వస్త్రాల్ని వినియోగించుకోవటం కనిపిస్తుంది.

యాగం తొలిరోజున పసుపు రంగు.. రెండో రోజు గులాబీ రంగు.. మూడో రంగు తెలుపు.. నాలుగో రోజు ఎరుపు.. ఐదో రోజు పసుపు రంగు పంచె.. ధోవతీని ధరించనున్నారు. ఏ రోజుకు ఆ రోజు పూజను అనుసరించి రుత్వికులు సూచించిన విధంగా ఈ వస్త్రధారణ జరుగుతుంటే.. దీనికి కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పలు రాజకీయ పార్టీ నేతల్ని కారు ఎక్కిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా చేపట్టిన యాగంతో పసుపు (టీడీపీ).. గులాబీ (టీఆర్ఎస్).. తెలుపు (కాంగ్రెస్).. ఎరుపు(కమ్యూనిస్ట్ లు) వస్త్రాలతో ఆయా పార్టీలపై గురి పెట్టుకుంటన్నారని సరదాగా చెప్పుకుంటున్నారు. రోజుకో రంగు వస్త్రాలతో ఆయా పార్టీలపై గురి పెట్టారంటూ జోక్ చేస్తూ.. ఈ యాగం తర్వాత మిగిలిన పార్టీల పని అయిపోయినట్లేనని కామెంట్లు చేసుకోవటం కనిపిస్తోంది. మొత్తం ఐదు రోజుల్లో రెండు రోజులు పసుపురంగు వస్త్రాల్ని ధరించటంపై రానున్న రోజుల్లో మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారో..?