Begin typing your search above and press return to search.

నామా ఎంపిక‌లో కేసీఆర్ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:13 AM GMT
నామా ఎంపిక‌లో కేసీఆర్ వ్యూహం ఇదేనా?
X
నిన్న కాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన నామాకు టీఆర్ ఎస్ లోక్ సభా ప‌క్ష నేత‌గా ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎందుకిలా..? లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు టీడీపీ నేత‌గా ప్ర‌ముఖుడైన ఆయ‌న్ను గులాబీ ప‌క్ష నేత‌గా ఎలా ఎన్నుకుంటార‌న్న‌ది ప‌లువురి ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. నామా ఎంపిక‌లో కేసీఆర్ లెక్క‌లు చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఢిల్లీలో ప‌రిచ‌యాలు చాలా కీల‌క‌భూమిక పోషిస్తూ ఉంటాయి. టీడీపీ ప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. సుదీర్ఘ‌కాలం ఢిల్లీలో అనుబంధాలు ఉన్న నామాకు ఎవ‌రితో ఎలా వ్య‌వ‌హ‌రించాలో బాగా తెలుసు. పార్టీ ప‌క్ష నేత‌గా ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

జాతీయ స్థాయిలో నేత‌ల‌తో సంబంధాల‌తో పాటు.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు వారితో దౌత్యం న‌డపాల్సి వస్తే.. ఆ ప‌ని నామా బాగా చేయ‌గ‌ల‌రు. ఒక‌ప‌క్క కేసీఆర్ కుమార్తె క‌విత ఎంపీగా ఓడిన నేప‌థ్యంలో.. ఢిల్లీలో అన్ని తెలిసినోడు.. అన్ని పార్టీల‌తో ప‌రిచ‌యాలు ఉన్నోడు నామా ఒక్క‌రే. అలాంటి నేత‌కు ప‌ద‌వి ఇవ్వ‌కుండా ప‌నులు చేయించాల్సి వ‌స్తే క‌ష్టం. అందుకే.. పార్టీ లోక్ స‌భా ప‌క్ష నేత‌గా ఎంపిక చేస్తే మంచిద‌న్న ఆలోచ‌న‌తోనే ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

రాజ‌కీయ నేత‌గా నామాకు మంచి పేరు లేన‌ప్ప‌టికీ.. ప‌లు పార్టీల‌తో ఆయ‌న‌కున్న సంబంధాల విష‌యంలో ఆయ‌న్ను తోపుగానే చెప్పాలి. జాతీయ స్థాయిలో ఏదైనా అంశంపై మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాలంటే అప్ప‌టిక‌ప్పుడు స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించే టాలెంట్ ఆయ‌న సొంతం. అంతేకాదు.. తెలంగాణ‌కు సంబంధించిన అంశాల్లో ఆయ‌న‌కున్న ప‌ట్టు కూడా ఎక్కువే.

తెలంగాణ బిల్లు.. బాబ్లీ పోరాటంతో పాటు ప‌లు జాతీయ‌..రాష్ట్ర అంశాల‌పై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ గా ఉంటారు. ఇలాంటివి ఏమైనా వ‌స్తే.. ఎలా డీల్ చేయాలో ఆయ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలోనే నామాకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లుగా చెప్పాలి. మిగిలిన ఏ ఎంపీకి ఈ ప‌దవి ఇచ్చినా.. కేసీఆర్ త‌ర‌చూ ఫాలోఅప్ చేస్తుండాలి. అదే.. నామాకు అయితే అలాంటి అవ‌స‌రం ఉండ‌దు. ఈ కార‌ణంతోనే నామాకు ఈ ప‌ద‌విని అప్ప‌జెప్పి ఉంటార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.