Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కేసీఆర్ పంచాయ‌తీ షురూ

By:  Tupaki Desk   |   16 July 2016 10:29 AM GMT
ఢిల్లీలో కేసీఆర్ పంచాయ‌తీ షురూ
X
రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి ఏపీ - తెలంగాణ మ‌ధ్య నెల‌కొన్న ప‌లు వివాదాలు మ‌రోసారి ఢిల్లీలో వేడెక్క‌నున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఢిల్లీలో నిర్వ‌హిస్తున్న సీఎంల స‌ద‌స్సుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అంత‌ర్రాష్ట్ర మండ‌ళ్ల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధాని మోడీ సీఎంల‌తో చ‌ర్చించ‌నున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - ఎంఎం పుంఛి కమిషన్ సిఫార్సులు - రాష్ట్రాల్లో ఆధార్ ప్రగతి - అంతర్గత భద్రత - ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అంశాలపై సీఎంల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిశితంగా చర్చించనున్నారు. దీంతో ఈ ప‌ర్య‌ట‌న‌నే సీఎం కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. చాన్నాళ్ల‌ త‌ర్వాత ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టిస్తుండ‌డం - ఇప్ప‌టికే రాష్ట్రంలో హైకోర్టు విభ‌జ‌న స‌హా వాడివేడి స‌మ‌స్య‌లు నెల‌కొన‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయా విష‌యాలపై ఢిల్లీ పెద్ద‌ల‌తో పంచాయ‌తీ నిర్వ‌హించి ప‌రిష్కారం అన్వేషించాల‌ని కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

దీంతో ఆయ‌న హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ - న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర ప్ర‌సాద్‌ - కేబినెట్ సెక్ర‌ట‌రీలు స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ఆయా స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌నున్నార‌నేది స‌మాచారం. దీంతో వరుస భేటీలతో సోమవారం వరకు బిజీబిజీగా గడపనున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి తెలంగాణ‌కు రావాల్సిన నిధుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాత్సారం చేస్తున్న అంశాన్ని కూడా కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వివ‌రించే య‌త్నం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఈ సంద‌ర్భంగా కేంద్రానికి స్వ‌యంగా కేసీఆర్ వివ‌రిస్తారు. జిల్లాల ఏర్పాటుకు కేంద్ర స‌హ‌కారం అత్య‌వ‌స‌రం కాబ‌ట్టి ఈ విష‌యాన్ని హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ తో భేటీ సంద‌ర్భంగా కూలంక‌షంగా ఆయ‌న‌కు వివ‌రిస్తార‌ని తెలిసింది. అలాగే,త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న మిష‌న్ కాక‌తీయపై కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమాభార‌తితో కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.

అదేవిధంగా ఏపీ - తెలంగాణ మ‌ధ్య కొలిక్కి రాకుండా ఉన్న నీటి వివాదాల‌పైనా చ‌ర్చించే అవ‌కాశం లేక‌పోలేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక చాలా స్కెచ్ గీసుకున్నార‌ని టీఆర్ ఎస్ స‌హాప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే మ‌రో రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు - సమస్యలు కొలిక్కివచ్చిన తరువాతే హైదరాబాద్‌‌ కు తిరిగి వ‌స్తార‌నే తెలుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ ఒక విష‌యంపై దృష్టి పెట్టారంటే అది తేల్చుకునే వ‌ర‌కు నిద్ర‌పోర‌నే ప్ర‌చారం ఉంది. ఇక‌, రాష్ట్ర స‌మస్యల ప‌రిష్కారం లోనూ ఆయ‌న త‌న‌దైన శైలిలోనే ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది.