Begin typing your search above and press return to search.

కేంద్రంపై కేసీఆర్ ఫైర్‌..లాజిక్ ఎన్నిక‌లేనా?

By:  Tupaki Desk   |   27 Feb 2018 8:27 AM GMT
కేంద్రంపై కేసీఆర్ ఫైర్‌..లాజిక్ ఎన్నిక‌లేనా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. త‌న రాష్ట్రం గురించి - దేశం గురించి - రైత‌న్న‌ల గురించి త‌న‌దైన శైలిలో విస్తృతంగా ప్ర‌సంగిస్తూ విరుచుకుప‌డ్డారు. ఏకంగా పోరాట కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో నిర్వహించారు. ఈ సదస్సులో మాట్లాడిన సీఎం.. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశంలోనూ - సమైక్య రాష్ట్రంలోనూ రైతులకు జరిగిన అన్యాయాలపై నిప్పులు చెరిగారు. దేశంలోని రైతుల స్థితిగతులను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ - బీజేపీ దారుణంగా విఫలమయ్యాయని సీఎం మండిపడ్డారు. తాను ఒక రైతు బిడ్డగా ఈ ఆరోపణ చేస్తున్నానని చెప్పారు. దేశం మొత్తంమీద 70వేల టీఎంసీల నీటి లభ్యత ఉంటే కేవలం 26-27 వేల టీఎంసీల నీరు మాత్రమే ఎందుకు వినియోగం అవుతోంది? లభ్యత ఉన్న నీటిలో 35% మాత్రమే ఎందుకు వినియోగించుకోవాల్సి వస్తున్నది? కాంగ్రెస్ - బీజేపీ హైకమాండ్‌ లకు దమ్ముంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి అని కేసీఆర్ సవాలు విసిరారు. రైతును రాజును చేస్తున్నాం.. రైతుకు కిరీటం పెడుతున్నాం అని చెప్తున్న పార్టీలు ఎందుకు ఈ విషయంపై దృష్టి సారించలేకపోయాయని నిలదీశారు. జై జవాన్-జైకిసాన్ అంటూ లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు. కానీ నేడు దేశం పరిస్థితి ఏందీ? నీటి లభ్యత ఉన్నా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? ఏమిటీ దురవస్థ? తెలివితక్కువ కాంగ్రెస్ - బీజేపీ నాయకుల - ప్రభుత్వాల వైఫల్యం కాదా ఇది? అని ప్రశ్నించారు.

ఇంత‌కీ గులాబీ బాస్ ఆగ్ర‌హం వెనుక ఏంటి కార‌ణం అంటే రాబోయే ఎన్నిక‌లేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు ఆయ‌న ప్ర‌సంగంలోని అంశాలే కార‌ణం అని చెప్తున్నారు. `కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు కేంద్రం గోదావరి - కావేరి అనుసంధానం అంటూ డ్రామా మొదలుపెట్టింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ అనుసంధాన ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు? కర్ణాటక ఎలక్షన్లు వస్తేనే అనుసంధానం గుర్తుకు వస్తుందా?` అని కేసీఆర్‌ నిలదీశారు. `కాంగ్రెస్‌ - బీజేపీ 70 ఏళ్ల పాలనలో రైతులకు నీరందించే తెలివి లేదు. ఇంకా ఇంత గొప్పోల్లం అంత గొప్పోల్లం అంటూ జీడీపీలు - జీడీకేలు బొంద బోకే అంటూ చివరికి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చారు. తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లు అవుతోంది. గోదావరిలో మా వాటా ఎంతంటే చెప్పరే? ట్రిబ్యునల్‌ లో వేస్తమంటరే? దశాబ్దాలు గడుస్తున్నాయి. కేంద్రం - ప్రధానమంత్రి గడ్డి కోస్తున్నాడా? ఎవరి వాటా ఎంతో చెప్పే ధైర్యం లేదా? ఒక సిస్టమ్ తీసుకొని రారాదా?` అని నిప్పులు కురిపించారు.

ఉద్యోగులకు రెండేళ్ల‌కోసారి - ఐదేళ్ల‌కోసారి వేతనాలు పెంచుతున్నారని - ధరలకనుగుణంగా రైతులకు కూడా మద్దతు ధర ఎందుకు పెంచరని కేసీఆర్ ప్రశ్నించారు. `రైతులకు నోరు లేదు.. అమాయకులు.. వీళ్లకు నాయకులు లేరు.. అడిగే వారు లేరు.. దిక్కులేక ఓటేస్తరు.. అనే పద్ధతిలో రైతు పట్ల నిర్లక్ష్య భావం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయి. దేశ రైతాంగం కదిలి, వాళ్లకు నిద్రలేకుండా చేసిననాడే రైతాంగానికి న్యాయం జరుగుతుంది. దీనికి శ్రీకారం తెలంగాణ నుంచే మొదలవుతుంది. దానికి నాయకత్వం అవసరమైతే తెలంగాణే వహిస్తుందని గంట బజాయించి చెప్తున్నాను. దేశ రైతాంగం సహనం - ఓపికను కోల్పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రైతుల తిరుగుబాటు తప్పదు. ఆ పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహిస్తాయి` అని కేసీఆర్ ప్రకటించారు. త‌ద్వారా కీల‌క‌మైన రైత‌న్న‌ల ప‌క్షాన తానున్నాన‌నే సందేశాన్నాయి.