Begin typing your search above and press return to search.

బాబుపై కేసీఆర్ ఎందుకింత‌గా విరుచుకుప‌డ్డారు?

By:  Tupaki Desk   |   30 Dec 2018 10:13 AM GMT
బాబుపై కేసీఆర్ ఎందుకింత‌గా విరుచుకుప‌డ్డారు?
X
టీడీపీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన తీరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. బాబును కేసీఆర్ విమ‌ర్శించ‌డం కొత్తేమీ కాదు. కానీ - ఈసారి ఆయ‌న ఉప‌యోగించిన ప‌ద‌జాలం - వ‌దిలిన వాగ్బాణాలు మామూలుగా లేవు. ఒక్కో విష‌యాన్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత‌ను చీల్చి చెండాడారు.

ఉన్న‌ట్టుండి కేసీఆర్ ఇంత‌గా చంద్ర‌బాబుపై ధ్వ‌జమెత్త‌డం వెనుక కార‌ణాలేంట‌ని ప్ర‌స్తుతం రాజ‌కీయవ‌ర్గాలు బుర్ర‌లు బ‌ద్ద‌లుకొట్టుకుంటున్నాయి. గులాబీ ద‌ళ‌ప‌తి ప‌లువురు ముఖ్య‌మంత్రులు - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీల‌ను పూర్తి చేసుకొని స్వ‌రాష్ట్రానికి తిరిగి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయా నేత‌ల‌తో స‌మావేశాల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల గురించి మాట్లాడారంటే ఓ లెక్క ఉంద‌నుకోవ‌చ్చు. అందుకు భిన్నంగా ఆయ‌న పూర్తిగా చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకున్నారు. టీడీపీ నేత‌లు సైతం ఈ ప‌రిణామాన్ని ఊహించ‌నే లేదు. ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు కేసీఆర్ మా అధినేత మీద ప‌డ్డారేంటి అని వారు బిత్త‌ర‌పోయారు.

చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల వెనుక కేసీఆర్ స్ట్రాట‌జీ ఏమై ఉంటుంద‌నే దానిపై ప్ర‌స్తుతం ప‌లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు నెల‌లే మిగిలి ఉన్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తోపాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లూ జ‌ర‌గ‌నున్నాయి. దీంతో చంద్ర‌బాబుకు అధికారాన్ని దూరం చేయాల‌ని కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ట‌. అందులో భాగంగానే ఏపీలో బాబు ఇమేజీని డ్యామేజ్ చేసేలా విరుచుకుప‌డుతున్నారట‌. రాబోయే నెల‌ల్లో ఇంత‌కంటే తీవ్రంగా ఆయ‌న బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. త‌ద్వారా ఏపీలో టీడీపీపై ప్ర‌తిప‌క్షాలు పైచేయి సాధించేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి దోహ‌దం చేయ‌నున్నారట‌.

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి వ్య‌తిరేకంగా వైసీపీ - జ‌న‌సేన‌ - బీజేపీ ఉన్నాయి. కానీ - ఆ పార్టీలు టీడీపీని గ‌ట్టిగా టార్గెట్ చేయ‌లేక‌పోతున్నాయి. చంద్ర‌బాబు - ఇత‌ర టీడీపీ నేత‌ల‌పై మాట‌ల తూటాలు పేల్చ‌డంలో జ‌గ‌న్‌ - ప‌వ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను కూడా వారు సొమ్ముచేసుకోలేక‌పోతున్నారు. అందుకే స్వ‌యంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు బాబు మొహం కూడా చూపించుకోలేనంత‌గా ఆయ‌న ఇమేజ్ ని దెబ్బ‌తీయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు. త‌ద్వారా ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల‌ని ఆయ‌న యోచిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.