Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీలకు చెక్ చెప్పే కేసీఆర్ అస్త్రం

By:  Tupaki Desk   |   8 Sep 2019 5:49 AM GMT
బీజేపీ ఎంపీలకు చెక్ చెప్పే కేసీఆర్ అస్త్రం
X
తెలంగాణ కేబినెట్ లో ఎవ్వరూ ఊహించని వ్యక్తి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అనూహ్యంగా బీసీ-కాపు కోటాలో కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటువివ్వడం విశేషం. తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు తెలంగాణ మంత్రివర్గంలో చోటులేకుండా ఉంది. పోయిన కేబినెట్ లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నను కేసీఆర్ కాపు కోటాలో తీసుకున్నారు. ఈసారి ఆయనకు చోటివ్వలేదు.

అయితే తాజా కేబినెట్ విస్తరణలో కాపుకోటాలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కేసీఆర్ చోటివ్వడం విశేషం. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటల, కొప్పుల ఈశ్వర్ లు మంత్రులుగా ఉన్నారు. వీరికి తోడుగా కేటీఆర్, గంగులను తీసుకోబోతున్నారట.. అంటే ఒక జిల్లాకు ఏకంగా నలుగురికి కేబినెట్ లో చోటిచ్చారు కేసీఆర్. ఇది అనూహ్యం.. అసాధారణం.. కానీ దీనికి ఓ లెక్కుంది.

అయితే కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలుగా గెలిచిన బండిసంజయ్, అరవింద్ లు కాపు సామాజికవర్గ నేతలే. ఇద్దరూ బలంగా ముందుకెళుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాపులను తమవైపు తిప్పుకునేందుకు ఆ వర్గం మంత్రి అవసరం. పైగా కరీంనగర్ కార్పొరేషన్ పై పట్టుచిక్కాలంటే కరీంనగర్ ఎమ్మెల్యే, ప్లస్ కాపు అయిన గంగుల ఉంటే బీజేపీని ధీటుగా ఎదుర్కోగలరు. ఆ కోణంలోంచే చెలరేగిపోతున్న కాపు ఎంపీలకు చెక్ చెప్పేందుకే ఫైర్ బ్రాండ్ అయిన గంగులను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు తెలిసింది.

ఇదే గంగుల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ ను చిత్తూగా రెండు సార్లు ఓడించాడు. పైగా సంజయ్ తో ఢీ అంటే ఢీ అనే గంగుల బెదిరింపులు అప్పట్లో సంచలనమయ్యాయి. ఈ దూకుడు చూసే కేసీఆర్ బీజేపీ ఎంపీలపై గంగుల అస్త్రం ప్రయోగించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.