Begin typing your search above and press return to search.

ఎందుకు?: కేసీఆర్ నోట‌..సిట్టింగ్ లకు టికెట్లు!

By:  Tupaki Desk   |   27 Aug 2017 6:43 AM GMT
ఎందుకు?: కేసీఆర్ నోట‌..సిట్టింగ్ లకు టికెట్లు!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోట మాట వ‌చ్చిందంటే అంతే అంటూ ఆ పార్టీ నేత‌లు త‌ర‌చూ గొప్ప‌లు చెప్ప‌టం క‌నిపిస్తుంటుంది. తాను ఒక మాట అంటే వెన‌క్కి త‌గ్గేదే లేదంటూ కేసీఆర్ సైతం త‌న గురించి తాను చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. కేసీఆర్‌ మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

ఇలా మాట‌లు చెప్ప‌టం.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం రాజ‌కీయ నేత‌ల‌కు మామూలే అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తుంటాయి. అయితే.. మిగిలిన నేత‌ల‌కు కేసీఆర్‌కు వ్య‌త్యాసం ఏమిటంటే.. చెప్పిన మాట మీద నిల‌బ‌డ‌కున్నా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు పెద్ద‌గా వెల్లువెత్త‌క‌పోవ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంద‌ని చెప్పాలి. తాను చెప్పిన మాట‌ను అమ‌లు చేయ‌కుండా.. అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే స‌మ‌యానికి.. ప‌రిస్థితుల్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టం ఆయ‌న‌లో క‌నిపిస్తుంది.

కొద్ది రోజుల కింద‌ట మాట్లాడుతూ.. ప‌ని తీరు స‌రిగా లేని నేత‌లకు తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని.. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైనం వార్త‌ల్లో వ‌చ్చింది. సిట్టింగ్ ల‌లో ప‌ని తీరు ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుంద‌ని.. ఇప్ప‌టికే ప‌ని తీరుపై త‌న ద‌గ్గ‌ర ప‌క్కా స‌మాచారం ఉందంటూ ఆయ‌న మాట‌లు గుర్తుండే ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సిట్టింగ్ లంద‌రికి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా ప‌రిణామంతో వివిధ పార్టీల నుంచి జంపింగ్స్ అయిన వారికి టికెట్లు ప‌క్కా అయితే.. ఆ స్థానాల్లో పార్టీని.. అధినేత‌ను న‌మ్ముకొని టికెట్ల మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న‌ వారంద‌రికి షాక్ త‌గిలేలా కేసీఆర్ తాజా మాట‌లు ఉండ‌టం గ‌మనార్హం.

ప్ర‌తిప‌క్షం వీక్ గా ఉంద‌ని.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ తిరుగులేని రీతిలో విజ‌యంసాధిస్తుంద‌ని మ‌రోసారి లెక్క‌లు చెప్పుకొచ్చారు. మొత్తం 119 స్థానాల్లో మ‌జ్లిస్‌కు చెందిన ఏడుస్థానాల్ని వ‌దిలేస్తే.. మిగిలిన 112 స్థానాల్లో 105 స్థానాల్లో సునాయాసంగా టీఆర్ ఎస్ గెలుస్తుంద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పుకొచ్చారు. మిగిలిన ఏడు స్థానాల్లోనూ క‌ష్ట‌ప‌డితే విజ‌యం త‌థ్య‌మ‌ని చెప్ప‌టం విశేషం.

అంటే.. తెలంగాణ‌లో విప‌క్షాలు నామ‌మాత్రంగా కూడా లేవ‌న్న మాట‌ను కేసీఆర్ త‌న లెక్క‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. తెలంగాణ‌లో తాను తాజాగా చేప‌డుతున్న స‌మ‌గ్ర భూస‌ర్వే కింద రెవెన్యూ రికార్డుల్ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌టం చారిత్రాత్మ‌క‌మ‌ని.. విప్ల‌వాత్మ‌కంగా ఆయ‌న అభివ‌ర్ణిస్తున్నారు. దేశంలో మొద‌టిసారి చేప‌డుతున్న ఈ కార్య‌క్ర‌మాన్ని రైతులు.. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో సంపూర్ణంగా విజ‌య‌వంతం చేసేలా ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని పిలుపునివ్వ‌టం గ‌మ‌నార్హం.

కొద్దిరోజుల క్రితం వ‌ర‌కూ ప‌ని తీరు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుంద‌న్న కేసీఆర్‌.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సిట్టింగుల‌కు టికెట్ల జారీ అని చెప్ప‌టంఎందుకు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన స‌మ‌గ్ర భూస‌ర్వే కార్య‌క్ర‌మం భారీగా ఉండ‌టం.. మూడు.. నాలుగు నెల‌ల వ‌ర‌కూ ఇందుకు స‌మ‌యం తీసుకోవ‌టంతోపాటు.. స్థానిక ఇబ్బందుల్ని డీల్ చేయాల్సిన నేప‌థ్యంలో స్థానిక నేత‌ల స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి. అందుకే.. అంద‌రి స‌హ‌కారంతో చేయాల్సిన కార్య‌క్ర‌మం కావ‌టంతో ప‌నితీరును ప‌క్క‌న పెట్టేసి.. అంద‌రికి టికెట్లు అన్న మాటను చెప్ప‌టం ద్వారా అంద‌రిలోనూ కొత్త హుషారును తీసుకురావాల‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ కొత్త మాట‌ను చెప్పార‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలంద‌రికి మ‌ళ్లీ టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పిన కేసీఆర్‌.. మిగిలిన స్థానాల్లోనూ అభ్య‌ర్థుల ఎంపిక పూర్తి అయిన‌ట్లుగా చెప్ప‌టం విశేషం. ఎన్నిక‌ల‌పై ఎలాంటి చింత అవ‌స‌రం లేద‌ని.. తాను బాధ్య‌త తీసుకొని అంద‌రిని గెలిపించి తీసుకొస్తాన‌ని.. అంత‌వ‌ర‌కూతాను చెప్పిన ప‌ని చెప్పిన‌ట్లుగా చేయాలంటూ కేసీఆర్ మాట‌ల్ని చూస్తే.. అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.