Begin typing your search above and press return to search.

అంతిమ సంస్కారాల‌కు కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు?

By:  Tupaki Desk   |   18 Aug 2018 5:19 AM GMT
అంతిమ సంస్కారాల‌కు కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అంచ‌నాల‌కు చిక్క‌ని రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. కొన్ని విష‌యాల్లో ఎంత చొర‌వ‌గా ముందుకు వ‌స్తారో.. అదే స‌మ‌యంలో మ‌రికొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న కంటికే క‌నిపించ‌రు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌ని రీతిలో ఉంటుంది.

భార‌త‌ర‌త్న‌.. మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. ఆ మాట‌కు వ‌స్తే.. అప్పుడెప్పుడో ప‌దిహేనేళ్ల (సుమారుగా మాత్ర‌మే సుమా) క్రితం దేశ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన నేత‌కు నివాళులు అర్పించేందుకు ఎక్క‌డెక్క‌డి దేశాలు సైతం.. త‌మ ప్ర‌తినిధుల్ని ఢిల్లీకి హుటాహుటిన పంపింది. మ‌రి.. అలాంట‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ల‌న‌ట్లు?

వాజ్ పేయి మ‌ర‌ణ వార్త అనంత‌రం.. శుక్ర‌వారం ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు.. స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. వాజ్ పేయి మీద త‌న‌కున్న ప్రేమాభిమానాల్ని.. గౌర‌వాన్ని సంతాప సందేశాల రూపంలో ప్ర‌క‌టించినా.. ఢిల్లీకి వెళ్లి ఉండాల్సింది క‌దా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.

గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. ప‌లువురు ప్ర‌ముఖుల అంతిమ సంస్కారాలకు ఆయ‌న హాజ‌రు కావ‌టం చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. ఎందుకిలా అనే దానికి ప‌లు వాద‌న‌లు వినిపిస్తూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఢిల్లీతో మంచి రిలేష‌న్స్ ఉన్న కేసీఆర్.. వాజ్ పేయి అంతిమ సంస్కారాల‌కు హాజ‌రై ఉంటే బాగుండేద‌న్న మాట పార్టీలోనూ చ‌ర్చ జ‌ర‌గ‌టం విశేషం.

అయితే.. త‌న సోద‌రి ద‌శ‌దిన క‌ర్మ‌లు ఉండ‌టంతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌లేద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతున్నారు. దీనికి కౌంట‌ర్ గా మ‌రికొంద‌రు రియాక్ట్ అవుతూ.. కేసీఆర్ సోద‌రి ద‌శ‌దిన క‌ర్మ‌లు మ‌ధ్యాహ్న‌మే పూర్తి అయ్యాయ‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. ఉద‌య‌మే ఢిల్లీకి వెళ్లి నివాళులు అర్పించి వ‌స్తే స‌రిపోయేది క‌దా? అన్న సందేహాం ప‌లువురి నోట వినిపించింది.

ఏది ఏమైనా.. అంతిమ‌సంస్కారాల‌కు హాజ‌ర‌య్యే విష‌యంలో కేసీఆర్ లో క‌నిపించ‌ని పాల‌సీ ఏదో ఉన్న‌ట్లుగా ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. చాలామంది ప్ర‌ముఖులకు నివాళులు అర్పించేందుకు కేసీఆర్ వెళ్లింది త‌క్కువ‌న్న విష‌యాన్ని గుర్తు చేసుకోవాలంటున్నారు. ఏది ఏమైనా.. రాజ‌కీయ శిఖ‌రం వాజ్ పేయి లాంటి నేత‌కు నివాళులు అర్పించేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.