Begin typing your search above and press return to search.

కేబినెట్ విస్తరణ వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:33 AM GMT
కేబినెట్ విస్తరణ వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్
X
నమ్మకాలకు.. విశ్వాసాలకు.. సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను. మరి.. అలాంటి గులాబీ అధినేత.. శుభకార్యాలు.. కొత్త పనులు చేపట్టటానికి ఏ మాత్రం అనువుగా ఉండదని అభివర్ణించే భాద్రపద మాసంలో కేబినెట్ విస్తరణ నిర్ణయం తీసుకోవటం ఏమిటి? ఎందుకాయన తన సెంటిమెంట్లకు భిన్నంగా విస్తరణను హడావుడిగా చేపడుతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

మంత్రివర్గ విస్తరణ విషయం శనివారం రాత్రి 9 గంటల వేళలో మాత్రమే బ్రేక్ అయ్యిందన్నది చూస్తే.. ఈ విషయాన్ని ఎంత గుట్టుగా ఉంచారో అర్థమవుతుంది. దసరా వరకూ కేబినెట్ విస్తరణ లేదన్న సంకేతాలు ఇచ్చిన కేసీఆర్.. ఇంత హడావుడిగా కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరణ చేపట్టటానికి ఉన్న కారణాలపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.

గతానికి భిన్నంగా తెలంగాణపై కేంద్రం గురి పెట్టటం.. హరీశ్ రావును పక్కన పెట్టేయటం మీద అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంతో పాటు.. తన కొడుకును వీలైనంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న ఆసక్తి తాజా మంత్రివర్గ విస్తరణకు కారణాలుగా చెబుతున్నారు. దీనికి తోడు గడిచిన మూడు వారాలుగా విషజ్వరాలతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోంది. ప్రభుత్వానికి తలనొప్పిగా మారటంతో పాటు.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దీనికి తోడుగా యూరియా సమస్య మరింత ఇబ్బంది పెడుతోంది. ఇవి చాలవన్నట్లుగా యాదాద్రి దేవాలయంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు.. పార్టీ సింబల్ అయిన కారు.. ప్రభుత్వ పథకాల్ని చెక్కిన వైనం బయటకు రావటం.. వివాదాస్పదంగా మారిని ప్రభుత్వానికి డ్యామేజ్ గా మారింది.

ఇలాంటివేళలో.. రాష్ట్ర ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకునే రాజకీయ పరిణామం ఒకటి తెర మీదకు రావాలన్న ఆలోచనతోనే తాజా మంత్రివర్గ విస్తరణ ఉందని చెబుతున్నారు. ప్లానింగ్ లో తిరుగులేని మొనగాడుగా పేరున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే మంత్రివర్గ విస్తరణను అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చి.. మాస్టర్ ప్లాన్ వేయటంలో తనకున్న నేర్పును మరోసారి ప్రదర్శించారని చెప్పాలి.

కేసీఆర్ సెంటిమెంట్లకు తగ్గట్లు మంచి రోజు దసరా వరకు లేకున్నా.. ఉన్నంతలో మంచి రోజును ఎంపిక చేసి మంత్రివర్గ విస్తరణను చేపట్టి సర్కారులో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలన్న ఆలోచనతోనే తాజా విస్తరణ చేపట్టినట్లుగా తెలుస్తోంది.

శనివారం రాత్రి 9 గంటల వరకూ కూడా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఒక్కసారిగా తెర మీదకు వచ్చిన విస్తరణ అంశంతో టీవీల్లో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ లు.. ప్రత్యేక కథనాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓపక్క మూఢం.. మరోవైపు భాద్రపద మాసమైనా పట్టనట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నంతలో మంచి ముహుర్తాన్ని చూసి విస్తరణకు ఓకే అనేశారు.

సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్న వేళ.. అనూహ్యంగా పూర్తిస్థాయి కేబినెట్ ను కొలువు తీర్చేలా నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు ఒక్కరోజు ముందు.. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే గంటల ముందు కొత్త మంత్రులు తెరపైకి రానున్నారు. ముఖ్యమంత్రితో సహా తెలంగాణలో మొత్తం 12 మంది ఉండగా.. మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ మంత్రివర్గంలో మహిళకు చోటు లేని వేళ..తాజాగా మాత్రం ఇద్దరు మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించనున్నారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం కేబినెట్ లో ఆరుగురికి చోటు దక్కనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారిలో ఈటెల రాజేందర్.. మల్లారెడ్డి.. ఇంద్రకరణ్ రెడ్డిలపై వేటు తప్పదంటున్నారు. అయితే.. ఈ అంశంపై స్పష్టమైన సంకేతాలు కనిపించని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలను తప్పించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఆయన స్వరంలో ధిక్కారం కనిపించటం.. ఆయనకు మద్దతుగా పలు గొంతులు వినిపిస్తున్న వేళ.. ఇలాంటి వాటికి ఆదిలోనే చెక్ చెప్పాలన్న ఆలోచనలో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్క ఈటలను మాత్రమే తప్పిస్తే తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉండటంతో.. ఆయనతో పాటు మరో ఇద్దరు (మల్లారెడ్డి.. ఇంద్రకర్ రెడ్డి) తప్పించటం ద్వారా.. తాను ఎవరిని ఉపేక్షించేది లేదన్న సంకేతాల్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఎవరికి ఉందన్నది చూస్తే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు.. మేనల్లుడు హరీశ్ కు అవకాశం ఇవ్వనున్నారు. తొలుత హరీశ్ కు అవకాశం లేనప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హరీశ్ కు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక.. మహిళలైన సబిత.. సత్యవతికి ఈసారి ఖాయంగా మంత్రి పదవులు దక్కుతాయని చెబుతున్నారు. వీరితో పాటు గంగుల కమలాకర్ కు.. పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవులు ఖాయమంటున్నారు. మొత్తంగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటున్నారు.

ఒకవేళ.. ఇప్పటికే వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లు.. ఈటెల.. మల్లారెడ్డి.. ఇంద్రకరన్ రెడ్డిలపై వేటు వేసిన పక్షంలో వారి స్థానంలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపైనా కొన్ని ఆసక్తికర అంచనాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం.. వేటు పడిన ముగ్గురు స్థానంలో జోగు.. సండ్ర.. లక్ష్మారెడ్డిలకు అవకాశం లభిస్తుందంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా లక్ష్మారెడ్డి పని తీరు బాగుందని.. ప్రస్తుతం అదే శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల.. విష జ్వరాల్ని అరికట్టటంలో ఫెయిల్ అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఆరుగురు కొత్త మంత్రులని చెబుతున్నా.. ఆరుగురా? తొమ్మిది మందా? అన్నది మరికాసేపట్లో క్లారిటీ రావటం ఖాయం.