Begin typing your search above and press return to search.

ఎంపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ఈ ఆల‌స్య‌మేంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   20 March 2019 5:01 AM GMT
ఎంపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ఈ ఆల‌స్య‌మేంది కేసీఆర్‌?
X
ముందుస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న నిర్ణ‌య‌మే సంచ‌ల‌న‌మైతే.. అలా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి త‌మ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న లెట‌ర్ ఇవ్వ‌టం.. ఇది జ‌రిగిన ఒక‌ట్రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే సుమారు 90 శాతం మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం లాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీసే ద‌మ్ము.. ధైర్యం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సొంత‌మ‌ని చెప్పాలి. ప్ర‌భుత్వాన్నిర‌ద్దు చేయ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. ఎన్నిక‌ల బ‌రిలో నిలుచునే పార్టీ అభ్య‌ర్థుల్ని ఎంపిక చేస్తూ.. ఆ జాబితాను విడుద‌ల చేయ‌టానికి ఎంత క‌స‌ర‌త్తు అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యూహ‌మే కాదు.. ముందుచూపు.. ప‌క్కా ప్లానింగ్ చాలా అవ‌స‌రం.

ఇలాంటివి త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌న్న భావ‌న‌ను క‌ల‌గ‌జేయ‌టంలో కేసీఆర్ కు మించిన నేత తెలుగురాష్ట్రాల్లో మ‌రెక్క‌డా క‌నిపించ‌రు. ఆ మాట‌కు వ‌స్తే ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ తీరుతో వ్య‌వ‌హ‌రించే అధినేత ఎక్క‌డా క‌నిపించ‌ర‌ని చెప్పాలి. ఇంత‌టి విల‌క్ష‌ణ‌మైన కేసీఆర్‌.. అందుకు భిన్నంగా తాజా ఎంపీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న విష‌యంలో చేస్తున్న ఆల‌స్యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

ఎంపీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌ట‌మే కాదు.. నోటిఫికేష‌న్ విడుద‌లై.. నామినేష‌న్ల ప‌ర్వం షురూ అయి రెండు రోజులు అవుతున్నా.. ఎంపీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించే విష‌యంలో జ‌రుగుతున్న ఆల‌స్యం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగ‌రాల‌న్న ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును ఎప్పుడో పూర్తి చేసిన‌ట్లుగా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే.. తాను టికెట్లు ఇచ్చే అభ్య‌ర్థుల‌తో వ‌న్ టు వ‌న్ ఇప్ప‌టికే స‌మావేశ‌మైన‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో స్ప‌ష్టం చేస్తున్నాయి కూడా. మ‌రింత గ్రౌండ్ వ‌ర్క్ చేసిన త‌ర్వాత కూడా లిస్ట్ ను ఎందుకు ప్ర‌క‌టించ‌టం లేద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎంపీ ఎన్నిక‌ల వేళ వివిధ పార్టీల్లో చోటు చేసుకోనున్న ప‌రిణామాలు.. త‌మ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీ వ్యూహాలు ఒక కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల‌న్న ఆలోచ‌న‌తోనే కేసీఆర్ త‌న జాబితాను ఆపిన‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ అనుకుంటున్న‌ట్లుగా తెలంగాణ‌లో క్లీన్ స్వీప్ కాకుండా చేయ‌ట‌మే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బీజేపీలు పావులు క‌దుపుతున్నాయి.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ మ‌ల్కాజిగిరి ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్య‌ర్థిగా డీకే అరుణ దాదాపుగా ఖాయ‌మైన‌ట్లుగా చెప్పాలి. ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయ‌న్న ముంద‌స్తు స‌మాచారంతోనే కేసీఆర్ త‌న జాబితాను విడుద‌ల చేయ‌కుండా ఆపిన‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా జ‌రుగుతున్న ఎంపీ ఎన్నిక‌లు చాలా కీల‌క‌మైన‌వి కావ‌టం.. త‌న ఢిల్లీ స్వ‌ప్నం తీర్చుకునేందుకు కీల‌క‌భూమిక పోషించే వీలు ఉండ‌టంతో ఆచితూచి అడుగులు వేద్దామ‌న్న ఆలోచ‌నే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌కుండా ఆపుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా చోటు చేసుకుంటున్న అనూహ్య ప‌రిణామాలు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేసీఆర్ సిద్ధం చేసుకున్న అభ్య‌ర్థుల‌కు భిన్నంగా కొత్త ముఖాలు తెర మీద‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థుల‌కు త‌గ్గ‌ట్లు కేసీఆర్ తాను మొద‌ట అనుకున్న అభ్య‌ర్థుల్లో కొంద‌రిని మార్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ కార‌ణంతోనే అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కేసీఆర్ అన‌స‌రించిన వ్యూహానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది.