Begin typing your search above and press return to search.

అందుకే ఇద్ద‌రు సార్ల మ‌ధ్య భేటీలు బంద్!

By:  Tupaki Desk   |   7 July 2019 7:17 AM GMT
అందుకే ఇద్ద‌రు సార్ల మ‌ధ్య భేటీలు బంద్!
X
దేశంలో చాలానే రాష్ట్రాలు ఉన్నాయి. చాలామంది గ‌వ‌ర్న‌ర్లు.. ముఖ్య‌మంత్రులు ఉన్నారు. కానీ.. మ‌రే రాష్ట్రంలో లేని ప‌రిస్థితి తెలంగాణ‌లో ఉంద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించ‌ని రీతిలో గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ సంబంధాలు నెరిపేవారు. త‌ర‌చూ గ‌వ‌ర్నర్ తో భేటీ అవుతూ.. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి వివ‌రించేవార‌న్న ప్రెస్ రిలీజ్ లు వ‌స్తుండేవి.

ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాధినేత త‌ర‌చూ గ‌వ‌ర్న‌ర్ క‌లిసి.. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి వివ‌రించాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఇందుకు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు ల‌భించేవి కావు. నిజానికి ఈ భేటీల కార‌ణంగానే ముంద‌స్తు ఎన్నిక‌ల్ని తాను కోరుకున్న‌ట్లుగా కేసీఆర్ పూర్తి చేసుకోగ‌లిగార‌న్న పేరుంది.

మొన్న‌టి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్.. ముఖ్య‌మంత్రి మ‌ధ్య అంతా బాగుంద‌న్న‌ట్లుగా క‌నిపించిన‌ప్ప‌టికీ అలాంటిదేమీ లేద‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో విద్యాశాఖ అధికారుల‌తో గ‌వ‌ర్న‌ర్ రివ్యూ నిర్వ‌హించ‌టం.. తాజాగా పోడు భూముల వివాదం విష‌యంలోనూ గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాస్తంత గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే ఇటీవ‌ల కాలంలో గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ నిర్వ‌హించే రెగ్యుల‌ర్ భేటీలు త‌గ్గుముఖం ప‌ట్ట‌టం కూడా క‌నిపిస్తుంది. గ‌తంలో త‌ర‌చూ భేటీ అయ్యే ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు.. ఈ మ‌ధ్య‌న అలాంటివేమీ లేక‌పోవ‌టానికి కార‌ణం కేంద్రం నుంచి అందిన సంకేతాలుగా చెబుతున్నారు. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ మొద‌లు ఢిల్లీ స్థాయిలో ఏదైనా అంశాల‌కు సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్న గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు కేసీఆర్ కు కాస్త ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కాస్త దూరంగా ఉంటున్న‌ట్లుగా తెలుస్తోంది. మోడీషాలు త‌న‌ను టార్గెట్ చేసిన విష‌యాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. త‌న‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గ‌తంలో మాదిరి రానున్న రోజుల్లో జోరు మీటింగ్ లు ఈ ఇరువురు ప్ర‌ముఖుల మ‌ధ్య ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న మాట వినిపిస్తోంది.