Begin typing your search above and press return to search.

నగరంపై ఇంత ప్రేమ అందుకేనా కేసీఆర్‌ జీ!

By:  Tupaki Desk   |   24 May 2015 4:42 AM GMT
నగరంపై ఇంత ప్రేమ అందుకేనా కేసీఆర్‌ జీ!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు తన ప్రేమను అంతా నగరానికి పరిమితం చేశాడు. హైదరాబాద్‌ నగరానికి ప్రేమ పంచడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో శుచి శుభ్రతలను కాపాడటంపై దృష్టిపెట్టారు. నగరాన్ని పూర్తిగా శుభ్రం చేసే వరకూ విశ్రమించేది లేదని ఆయన అంటున్నాడు.

అంతే కాదు.. కేవలం రెండంటే రెండే నెలల్లో హైదరాబాద్‌ మహానగరం అద్దంలా మెరవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ఈ విషయంలో గట్టిగా పనిచేయాలని.. రెండు నెలల్లోనే క్లీన్‌ హైదరాబాద్‌గా మార్చేయగలమని ఆయన వ్యాఖ్యానించాడు.

అయితే ఏడాది కిందట ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఇప్పుడు ఇలా.. క్లీన్‌ హైదరాబాద్‌ గురించి మాట్లాడుతుండటం మాత్రం వినడానికే కొంత విచిత్రంగా ఉంది. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడేమిటిలా.. అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

అయితే కేసీఆర్‌ ఇలా స్వచ్ఛ హైదరాబాద్‌ పట్ల దృష్టి సారించడంలో ఉన్న లక్ష్యం అందరికీ స్పష్టంగా అర్థం అయ్యేదే..! త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఆయన ఈ పనికి పూనుకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో రెండో ఉద్దేశం లేదని తెలుస్తోంది.

ఎలాగూ ఇప్పటికే అనేక మంది కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తనవైపుకు తిప్పుకొన్నారు. వాటి ప్రభావం కొంత ఉంటుంది. ఇక న్యూట్రల్‌గా ఉండే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ స్వచ్ఛ బాణాన్ని ప్రయోగిస్తున్నాడు గులాబీదళపతి.

మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పరువును ఎంత మేరకు నిలుపుతుందో వేచి చూడాలి!