Begin typing your search above and press return to search.

కేసీఆర్ పచ్చీస్ తెలంగాణ మాట వెనుక మాస్టర్ ప్లాన్?

By:  Tupaki Desk   |   8 May 2016 11:30 AM GMT
కేసీఆర్ పచ్చీస్ తెలంగాణ మాట వెనుక మాస్టర్ ప్లాన్?
X
పెద్ద పెద్ద షోరూమ్ లు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. కొంతమంది అయితే.. ఒకటికి రెండు ఫ్రీ అంటారు. ఈ మధ్యన చీరల షాపుల వాళ్లు అయితే.. చీరల్ని కేజీల లెక్కన అమ్మటం షురూ చేసి సంచలనం సృష్టించారు. చీరల షాపులే కాదు.. ఆన్ లైన్లో అమ్మకాల వరకూ ఆఫర్లు మాట జోరుగానే వినిపిస్తుంది. మరి..ఈ ఆఫర్లు ఎవరికి? కొనుగోలు చేసే కస్టమర్లకా? అమ్మే షాపుల వారికా? కస్టమర్ల వరకూ అనుకునేది తమకు లాభం కలిగించేలా చేయటం కోసం.. బ్రాండ్ ప్రమోషన్ కోసం కంపెనీలు లాభాలకు కోత పెట్టుకొని ఆఫర్లు అందిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అదే నిజమైతే.. ఆఫర్లతో అమ్మకాలు నిర్వహించే సంస్థల ఆదాయాలు భారీగా పడిపోవాలి. కానీ.. అలా జరగటం లేదు ఎందుకు?

అసలు వ్యాపారం చేసేది ఎందుకు? లాభాల కోసమన్న విషయంలో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం ఉండదు. మరి.. లాభాల కోసం వ్యాపారాలు చేసే సంస్థలు.. వినియోగదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తాయా? ఒకవేళ చేసినా అందులో అంతర్లీనంగా వ్యాపార సంస్థ లాభమే ఉంటుంది తప్పించి మరొకటి ఉండదు. ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి.. తెలంగాణ రాజకీయంలోకి వెళదాం.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పెంపు మీద జోరుగా ప్రకటనలు చేస్తున్నారు. ఒక జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలంటే నానా యాగీ చేసినా కొత్త జిల్లా ఏర్పడదు. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పదిహేను కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో.. చిన్న జిల్లాలతో అభివృద్ధి మరింత జోరుగా ఉంటుందన్న వాదనతో కొత్త జిల్లాల అంశాన్ని సరికొత్తగా తెరపైకి తీసుకొచ్చారు.

కేసీఆర్ లాంటి రాజకీయ నేత ఉత్తపుణ్యానికే ఏదీ చేయరు. అన్నింటికి మించి ఏదైనా అంశం మీద ప్రత్యేక దృష్టి పెడితే.. అందులో ఏదో ఒక మతలబు ఉండే ఉంటుందన్నది ఖాయం. తాజాగా పచ్చీస్ తెలంగాణ (పాతవి పది జిల్లాలు.. కొత్తవి పదిహేను జిల్లాలు.. మొత్తంగా పాతికజిల్లాల తెలంగాణ) నినాదాన్ని ఎత్తుకోవటం వెనుక అసలుసిసలు కిటుకు ఏమైనా ఉందా? అంటే.. చాలానే ఉందని చెప్పొచ్చు.

కొత్త జిల్లాల ఏర్పాటు.. ఆ జిల్లాల్లో ఏయే నియోజకవర్గాలు ఉండాలన్న అంశానికి సంబంధించిన కసరత్తు లాంటివి అధికారపక్షానికి ఒక లాభంగా మారితే.. పెరిగిన జిల్లాలతో కేసీఆర్ సూపర్ పవర్ గా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఎందుకంటే.. జిల్లాలు పెరిగిన తర్వాత పదవుల కోసం ఆరాటపడే వారి సంఖ్య పెరుగుతుంది. దానికి తగ్గట్లే వివిధ హోదాల్లో పలువురు ఆశావాహుల్ని సర్దుబాటు చేయటం ద్వారా.. ఎందరికో పదవుల భిక్ష పెట్టిన అధినేతగా కేసీఆర్ ఆవిర్భవిస్తారు. ఇక.. జిల్లాల పెంపు నేపథ్యంలో.. చిన్నచిన్న జిల్లాలుగా మారటం.. స్థానికంగా నేతల పరిధి బాగా తగ్గిపోతుంది. ఇప్పటివరకూ పలు జిల్లాల పేరు చెప్పిన వెంటనే కొందరి నేతలు తళుక్కున మదిలో మెదులుతారు. జిల్లా రాజకీయాన్ని ప్రభావితం చేసే సత్తా వారిలో కనిపిస్తుంది.

అలాంటివి భవిష్యత్తులో మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పది జిల్లాలకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే సరాసరిన ప్రతి జిల్లాకు 12 నియోజకవర్గాలుగా అనుకుందాం. రేపొద్దున పాతిక జిల్లాలు అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగని పక్షంలో సరాసరి చేస్తే.. జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎంతకు తగ్గిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా జిల్లాల సంఖ్య పెరిగితే మరో సమస్య కూడా ఉంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 15 శాతం మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే వీలుంది. ఈ లెక్కన 18 మందికి మాత్రమే మంత్రులు అయ్యే అవకాశం ఉంది.

మొత్తం 10 జిల్లాలకు 18 మంది మంత్రులంటే కొన్ని జిల్లాల్లో ఇద్దరు.. మరికొన్ని జిల్లాల్లో ముగ్గురికి కూడా అవకాశం లభిస్తున్న పరిస్థితి. అలాంటిది రేపొద్దున 25 జిల్లాలు ఏర్పడితే.. 18 మంత్రి పదవులు ఉంటే..? జిల్లాకు ఒక్క మంత్రిపదవి కూడా దక్కని పరిస్థితి చోటుచేసుకుంటుంది. అదే జరిగితే.. ఇప్పటివరకూ జిల్లాకు మంత్రి కింగ్ గా ఉన్నోళ్లు కాస్తా.. రేపొద్దున వారి పరిస్థితి ఎలా ఉంటుందో..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే జరిగితే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ సూపర్ పవర్ గా మారిపోవటం ఖాయం. తనను తాను అత్యంత బలోపేతం చేసుకోవటానికి వీలుగా పచ్చీస్ తెలంగాణ కాన్సెప్ట్ ను తెర మీదకు కేసీఆర్ తీసుకొచ్చారా? అన్నది ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న. ఎంత బంపర్ ఆఫర్ ప్రకటించిన వ్యాపార సంస్థ అయినా.. తన జేబులో నుంచి డబ్బులు తీసి వినియోగదారులకు ఇవ్వనట్లే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చూస్తూ చూస్తూ తాను బలహీనం అవ్వాలని అనుకోరు కదా. వ్యాపారస్తుడికి.. రాజకీయ అధినేత అంతిమ లక్ష్యం తాము బాగుండాలనే కదా..?