Begin typing your search above and press return to search.

అందుకే కేసీఆర్ కు ఓవైసీ మీద అభిమానమా?

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:33 AM GMT
అందుకే కేసీఆర్ కు ఓవైసీ మీద అభిమానమా?
X
ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంటి మీద వైరి పార్టీ నేతలు దాడి చేయటమే కాదు.. ఆయన కొడుకును ఇంట్లో నుంచి తీసుకొచ్చి కొడితే? అధికారపక్షం ఎంతలా రియాక్ట్ అవుతుంది?

ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి మీద మధ్యాహ్న వేళ.. అందరూ చూస్తుండగా ఆయన కారు మీద ఒక ఎంపీ దాడి చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది?

శాంపిల్ గా ఈ రెండు సంఘటనలు చాలు.. మజ్లిస్ పార్టీ అధినేత.. వారి పరివారం హైదరాబాద్ లో ఎంతలా చెలరేగిపోయారో చెప్పటానికి. మిగిలిన సమయాల్ని పక్కన పెడితే.. పైన చెప్పిన రెండు సంఘటనలు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజు చోటు చేసుకున్న ఘటనలు. ఇంత జరిగినా.. అసద్ మీద కానీ.. ఆయన అనుచర వర్గం మీద కానీ పెద్ద ఎత్తున చర్యలు ఏమైనా తీసుకున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకలా అన్న డౌట్ అప్పట్లో చాలామందికి వచ్చి.. ఎవరికి వారు వారికి తోచిన మాటలు చెప్పుకున్నారు. కానీ.. అలా ఎందుకన్న విషయాన్ని ఇంతకాలానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాజా వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పేశారు.

అసద్ ఏం చేసినా తాను లైట్ తీసుకుంటానన్న విషయాన్ని కేసీఆర్ తనకు తానుగా చెప్పకున్నా.. మజ్లిస్ తమ మిత్రుడన్న మాటను కేసీఆర్ నోట అభిమానంగా రావటానికి కారణం ఏమిటి? అసద్ అంటే కేసీఆర్ కు అంత అభిమానం ఎందుకన్న విషయం కేసీఆర్ చెప్పిన తాజా మాటలు విన్న వెంటనే అర్థమవుతాయి. కాంగ్రెస్ నేతలు గుత్తా.. వివేక్.. వినోద్ లతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ కారు ఎక్కిన సందర్భంగా.. వారిని ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తెలుగుదేశం.. కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రయత్నించాయని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే.. తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర రాజకీయానికి తెర తీశారంటూ ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. రాష్ట్రపతి పాలనను పెట్టేందుకు కుట్ర చేసినట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్లాన్ ను తాను గుర్తించలేదని.. కానీ.. ఆ సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేసి మరీ కుట్ర వివరాల్ని తనకు చెప్పారన్నారు. విపక్షాల కుట్రల్ని చెప్పటమే కాదు.. వారికి చెక్ పెట్టేలా తాను అండగా నిలుస్తామని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. మరి.. అంత కీలక సాయం చేసిన అసద్ కానీ ఆయన ముఖ్యనేతలు కానీ ఆవేశంతో కాస్త ఎక్కువ తక్కువలు చేస్తే కేసీఆర్ లైట్ తీసుకోకుండా సీరియస్ గా రియాక్ట్ అవుతారా ఏంది?