Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక అస‌లు ముచ్చ‌ట ఇదే

By:  Tupaki Desk   |   10 Feb 2018 4:19 AM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక అస‌లు ముచ్చ‌ట ఇదే
X
కీల‌క ప‌రిణామాలు ఒక‌టి తర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న వేళ‌.. ముఖ్య నేత‌లు ఆ ప‌రిణామాల‌పై రియాక్ట్ కావ‌టం క‌నిపిస్తుంది. పేరుకు ఏపీ రాజ‌కీయాలైనా.. ఇటీవ‌ల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత‌లు సైతం స్పందిస్తున్నారు. తాజా బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఆంధ్రా ఎంపీలు గ‌ళం విప్ప‌గా.. వారికి తోడుగా తెలంగాణ ఎంపీలు ప‌లు సంద‌ర్భాల్లో గ‌ళం విప్పారు. ఏపీకి న్యాయం చేయాల‌న్న డిమాండ్‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

మ‌రింత‌లా తెలంగాణ ఎంపీలు రియాక్ట్ అవుతున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం బ‌య‌ట‌కే రావటం లేదు.బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయానికి త‌గ్గ‌ట్లే తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. ఈ విషయాల‌పై సీఎం కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు బ‌య‌ట‌కు కూడా రావ‌టం లేదు.

ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూ స‌చివాల‌యానికి డుమ్మా కొట్ట‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. అలాంటి ఆయ‌న‌.. క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్న‌ప్ప‌టికీ.. బ‌డ్జెట్ కేటాయింపులు మొద‌లుకొని.. లోక్ స‌భ‌లో తెలుగు ఎంపీల ఆందోళ‌న మీద గొంతు విప్పింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆస‌లు ఆయ‌న ముఖం చూపించిందే లేదు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న వేసుకొని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

గ‌డిచిన వారం రోజులుగా తీవ్ర‌మైన పంటి నొప్పితో సీఎం కేసీఆర్ బాధ ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి చికిత్స చేసేందుకు వైద్యులు వ‌చ్చినా ఆయ‌న స‌సేమిరా అన్న‌ట్లు చెబుతున్నారు. వైద్యం విష‌యంలో వెన‌క‌డుగు వేస్తూ.. ఆరోగ్య స‌మ‌స్య‌ను అంక‌తంత‌కూ సాగ‌తీయ‌టం కేసీఆర్ కు అల‌వాటే.

సూదిమందుతో పాటు.. ఆప‌రేష‌న్ లాంటివి ఆయ‌న అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతారు. ట్రీట్ మెంట్ విష‌యానికి వ‌స్తే మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం గ‌డిపేస్తున్నారు. దీంతో.. ఆయ‌న పంటి స‌మ‌స్య ఒక కొలిక్కి తెచ్చేందుకు కుటుంబ స‌భ్యుల నుంచి భారీగా ఒత్తిడి మొద‌లైంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీ టూర్ ఖ‌రారైంది.

ప్ర‌ధాని మోడీని క‌లిసేందుకు తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న అని ప‌లువురు చెబుతున్నా.. అదేమీ నిజం కాదని తెలుస్తోంది. త‌న‌కున్న ఆరోగ్య స‌మ‌స్య‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం ఇష్టం లేక‌నే ప్ర‌ధానితో భేటీ అన్న ప్ర‌చారం చేసిన‌ట్లుగా స‌మాచారం. త‌న‌కున్న పంటి స‌మ‌స్య‌ను తీర్చుకునేందుకు ఇప్ప‌టికే సీనియ‌ర్ వైద్యుడ్ని సంప్ర‌దించి.. ఆయ‌న చెప్పిన‌ట్లే తాజాగా చికిత్స‌కు సిద్ధ‌మ‌వుతున్నట్లుగా స‌మాచారం.

శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వేళ‌లో దంత వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్ల‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. చికిత్స ఈ రోజు నుంచే షురూ కానున్న‌ట్లు స‌మాచారం. చికిత్స త‌ర్వాత మ‌రో రెండు రోజులు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అంద‌రూ చెబుతున్న‌ట్లుగా ఈసారి కేసీఆర్ ది రాజ‌కీయ ప‌ర్య‌ట‌న ఎంత‌మాత్రం కాద‌ని.. ఇది కేవ‌లం మెడిక‌ల్ ట్రిప్ గా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. నొప్పి అదుపులోకి వ‌స్తే మాత్రం కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.