Begin typing your search above and press return to search.

వారంలోఎట్లా? పక్కా ప్లానా?

By:  Tupaki Desk   |   24 July 2015 4:03 AM GMT
వారంలోఎట్లా? పక్కా ప్లానా?
X
ఉస్మానియా ఆసుపత్రిని వారం రోజుల్లో తరలించాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తిస్తోంది. శిధిలావస్థకు చేరుకున్న భవనంలో ఆసుపత్రిని నడపటం ఏ మాత్రం క్షేమకరం కాదని.. హెరిటేజ్ బిల్డింగ్ పేరిట ఎప్పుడు కూలుతుందో తెలీని భవనాన్ని ఉంచటం ఏ మాత్రం మంచిది కాదంటూ వ్యాఖ్యలు చేశారు.

పెచ్చులూడుతున్న భవనంతో ఇప్పటికే పలువురు తలలు పగులుతున్నాయని.. జేఎన్ టీయూ నిపుణులు సైతం.. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారని.. మరమ్మత్తులు చేసిన ఐదేళ్ల కంటే ఎక్కువ నిలవదని.. అందుకే తరలింపు వెనువెంటనే చేయాలనుకుంటున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

ఉస్మానియా భవనం శిధిలావస్థకు చేరుకుందని.. దాన్ని వెంటనే తరలించకపోతే భారీ నష్టమే వాటిల్లుతుందని కేసీఆర్ చెబుతున్నారు. ఇక్కడ కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. జేఎన్ టీయూ ఇంజినీరింగ్ ప్రముఖులు సైతం భవనాన్ని మార్చాలని చెప్పారని చెబుతున్న కేసీఆర్.. వారు ఎప్పుడు చెప్పారో బయట పెట్టాల్సిన అవసరం ఉంది.

ఒక హెరిటేజ్ భవనాన్ని.. సురక్షితం కాదన్న పేరుతో కూల్చేయటంపై కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఘన చరిత్ర ఉన్న ఒక భారీ భవనాన్ని సింఫుల్ గా కూల్చేయటం తప్పించి మరెలాంటి ప్రత్యామ్నాయం లేదని చెప్పటం కాస్తంత ఆశ్చర్యం కలిగించకమానదు.

కేసీఆర్ చెప్పినట్లుగా.. మరమ్మత్తులు చేస్తే ఐదేళ్ల వరకూ బండి నడపొచ్చని చెప్పారు. ఇప్పటికిప్పుడు.. ఉస్మానియా ఆసుపత్రిని వివిధ ఆసుపత్రులకు తరలించటమో.. ఒక ప్రైవేటు భవనంలోకి మార్చటమో చేసే బదులు.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి.. అదే సమయంలో.. ఉస్మానియాకు ప్రత్యామ్నాయంగా.. ఒక స్థలాన్ని ఎంపిక చేసి.. ఐదేళ్ల వ్యవధిలో నిర్మించి.. కొత్త భవనంలోకి మారిస్తే బాగుంటుంది కదా?

అదేమీ లేకుండా.. వెను వెంటనే ఖాళీ చేయాలని.. అందుకు వారం రోజులే సమయం పెట్టుకోవటంలో ఉద్దేశ్యం ఏమిటన్నది అర్థం కాదు. వారంలో తరలించాలన్న మాటనే చూస్తే.. చెప్పిన రోజును తీస్తే.. ఆరు రోజులే మిగిలి ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ చెప్పిన రోజును వదిలేస్తే ఏడురోజులు ఉంటాయి? అంత పెద్ద ఆసుపత్రి.. అందులోని భారీ పరికరాల్ని తరలించటం సాధ్యమేనా? ఇంతకీ ఎక్కడకు తరలిస్తారు? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.

అయితే.. కేసీఆర్ నోటి నుంచి ఉస్మానియా తరలింపు గురించి వచ్చిన వెంటనే.. వైద్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యామ్నాలు చూపించటం గమనార్హం. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక ప్రకటన వెలువడిన వెంటనే.. మరో శాఖ.. దానిపై సమీక్ష చేసేసి.. గంటల వ్యవధిలో కొన్ని సూచనలు చేయటం చూసినప్పుడు.. ఎక్కడో ఏదో జరుగుతుందన్న సందేహం కలగక మానదు.

ఉస్మానియా ఆసుపత్రి తరలింపు వ్యవహారం చూస్తే.. ఇది నిజమనించక తప్పదు. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో.. విపక్షాలతో కలిసి నిర్ణయం తీసుకుంటే మరింత బాగుంటుంది. లేదంటే.. శాసనసభా కమిటీ వేసి.. దాని సూచనలతో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇదేమీ లేకుండా కేసీఆర్ సర్కారు తరలింపు ప్రకటన పలు సందేహాలకు తావిచ్చేలా ఉంది. చూస్తేంటే.. ఉస్మానియా తరలింపు వ్యవహారం ప్రీప్లాన్ మాదిరి ఉందే తప్పించి.. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం మాదిరగా లేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. మరి.. దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.