Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి కనిపించుట లేదు..

By:  Tupaki Desk   |   14 March 2016 5:53 AM GMT
కిషన్ రెడ్డి కనిపించుట లేదు..
X
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కొద్ది రోజులుగా కనిపించడం లేదు... సొంత పార్టీపై ఆగ్రహంతో ఆయన అలకబూనినట్లు సమాచారం. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి కిషన్‌ రెడ్డి గైర్హాజరవుతున్నారు. తోటి శాసనసభ్యులను ఈ అంశంపై ఆరా తీస్తే ఏ కారణం చేత ఆయన రావడం లేదో తమకు కూడా తెలియదని, అయితే అనారోగ్య కారణంగా సమావేశాలకు దూరంగా ఉంటున్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తమకు సమాచారం అందిందని చెబుతున్నారు. అయితే.... రాష్ట్ర భాజపా అధ్యక్షుడిని మార్చేందుకు ఇప్పటికే అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని వారం, పది రోజుల్లో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని.. ఆ కారణంగానే కిషన్ అలకబూని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

నూతన అధ్యక్షుడిగా తాను సూచించిన నాయకుడికి ఇవ్వాలని కిషన్ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధినాయకత్వం కిషన్‌ రెడ్డికి సానుకూలంగా వ్యవహరించడం లేదని తెలిసి ఆయన అలకబూనినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో శాసనసభాపక్ష నేతగా కిషన్‌ రెడ్డి వ్యవహరించారు. పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో శాసనసభాపక్ష నేతగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కు అవకాశం వచ్చింది. ప్రస్తుతం కిషన్‌ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది. ఈదఫా తెలంగాణ అధ్యక్షుడిగా బీసీ లేదా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు అగ్రనేతలు తనపై అధినాయకత్వానికి లేనిపోని ఫిర్యాదులు చేశారని, దీంతో తనపట్ల ఢిల్లి పెద్దలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని కిషన్‌ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.