Begin typing your search above and press return to search.

ముగ్గురు పోటీకి దూరం వెనుక ఇంతుందా.?

By:  Tupaki Desk   |   1 Nov 2018 10:40 AM GMT
ముగ్గురు పోటీకి దూరం వెనుక ఇంతుందా.?
X
తెలంగాణ ఎన్నికల వేళ సీట్ల తకరారు తేల్చడం కోసం ఇప్పుడు హస్తినలో అందరూ అడ్డావేశారు.మహాకూటమిలో ఎవరికెన్ని సీట్లు..? ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలని తేల్చే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే ఖరారైందని.. కూటమిలో కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల బాధ్యులు పోటీచేయరాదని నిర్ణయించుకున్నట్టు తెలియజేసింది.

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం - టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు ఈ ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. టీఆర్ ఎస్ ను గద్దెదించడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీచేయకుండా రాష్ట్రం మొత్తం ప్రచారం చేసి ఓడించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తే నియోజకవర్గానికే పరిమితమవుతామని.. అలా కాకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే మహాకూటమికి మేలు జరుగుతుందని వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద హామీనే లభించిందని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ఈ ముగ్గురు పార్టీల అధినేతలకు మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం.. స్వయంగా రాహుల్ చేత చెప్పించి ఒప్పించేందుకే ఢిల్లీకి రప్పించినట్టు సమాచారం. అందుకే వీరు పోటీచేయకుండా ఆ టికెట్లను కాంగ్రెస్ అభ్యర్థులకు వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది..

ఈరోజు ఢిల్లీలో విస్తృత చర్చల తర్వాత నవంబర్ 2న రేపు కాంగ్రెస్ పార్టీ 50మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేస్తారని సమాచారం. ఇందులో తాజా మాజీ ఎమ్మెల్యేలు - మాజీ మంత్రులు - సీనియర్లు ఉంటారట.. నోటిఫికేషన్ వచ్చాక రెండో జాబితాను విడుదల చేయనున్నారట.. ఈ మేరకు సదురు ఆంగ్ల పత్రిక కథనాలను ప్రచురించింది.