Begin typing your search above and press return to search.

అందుకే కోమటిరెడ్డి వెనక్కి తగ్గరా?

By:  Tupaki Desk   |   12 Jun 2016 8:14 AM GMT
అందుకే కోమటిరెడ్డి వెనక్కి తగ్గరా?
X
ముద్దు వచ్చినప్పుడే చంకకు ఎక్కాలి. ఆ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా అలాంటి అవకాశం మళ్లీ రాదు. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సార్వత్రిక ఎన్నికల ముందు నల్గొండ జిల్లా పార్టీ పగ్గాలు ఇస్తామంటూ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కోమటిరెడ్డికి సంకేతాలు బలంగా వెళ్లాయి. అయితే.. ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయాన్ని ఏ మాత్రం అంచనా వేయలేని కోమటిరెడ్డి ఆ ఆఫర్ ను వదులుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన గులాబీ కారు ఎక్కేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిన పరిస్థితి.

ఎన్నికల తర్వాత కేసీఆర్ ‘కారు’ స్పీడు గుర్తించిన కోమటిరెడ్డి తన సన్నిహితుల చేత పావులు కదిపించిన నేపథ్యంలో గులాబీ బాస్ నుంచి కొంత సానుకూలత వ్యక్తమైందని చెబుతున్నారు. కాకుంటే.. కోమటి రెడ్డి కోరుకుంటున్నట్లుగా మంత్రి పదవి ఇచ్చే విషయంలో హామీ ఇవ్వకపోవటంతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా సమాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో వ్యక్తిగత సంబంధాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్న మాటతో జరిగే ప్రయోజనం ఎంతన్నది కోమటిరెడ్డి బద్రర్స్ కు తెలియంది కాదు. అలా అని.. ఎలాంటి పదవుల హామీల లేకుండా పార్టీ చేరితే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అంతకు మించి ఉన్న పార్టీలోనే కొనసాగితే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందన్న భావన కోమటిరెడ్డి బ్రదర్స్ లో వ్యక్తం కావటంతో వారి పోక తాత్కాలికంగా నిలిచినట్లుగా తెలుస్తోంది. చూస్తూ.. చూస్తూ ఎలాంటి ప్రయోజనం లేకుండా ‘గులాబీ కారు’ ఎక్కటంలో ఎలాంటి లాభం ఉండదని ఊరకున్నట్లుగా తెలుస్తోంది.