Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌.. కేటీఆర్ చ‌ప్పుడు చేయ‌ట్లేదెందుకు?

By:  Tupaki Desk   |   9 Oct 2017 7:09 AM GMT
హ‌రీశ్‌.. కేటీఆర్ చ‌ప్పుడు చేయ‌ట్లేదెందుకు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు ఎంత చురుగ్గా ఉంటాయో అంద‌రికి తెలిసిందే. మాట‌ల తూటాల‌న్న దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఉంటాయి కేసీఆర్ వ్యాఖ్య‌లు. సింగ‌రేణి కార్మిక సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అనంత‌రం కోదండం మాష్టార్ని విమ‌ర్శ‌ల‌తో ఉతికేసిన కేసీఆర్ తీరు సంచ‌ల‌నమైంది. ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌తారా? అంటూ ఆశ్చ‌ర్య‌పోయినోళ్లు చాలామందే ఉన్నారు.

ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించిన కోదండంను అంతేసి మాట‌లు అన‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మైంది. దీంతో.. విప‌క్షాల‌న్నీ ఒకేసారి విరుచుకుప‌డ్డాయి. కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ఎప్ప‌టిలానే కోదండం మాష్టారు త‌న తీరుకు త‌గ్గ‌ట్లే ప‌దునుగా మాట్లాడారే కానీ.. ఒక్క మాట కూడా మిగ‌ల్లేదు. కోదండంపై కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విప‌క్షాల‌కు కౌంట‌ర్ ఇచ్చే ప‌నిని గులాబీ ద‌ళం స‌రిగా చేయ‌లేద‌న్న మాట ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.

తెలంగాణ అధికార‌ప‌క్షంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన వారికి త‌మ‌దైన శైలిలో తిరిగి జ‌వాబు ఇచ్చే టీఆర్ఎస్ కీల‌క నేత‌లైన మంత్రులు హ‌రీశ్‌.. కేటీఆర్‌.. ఈటెల స‌హా ఎవ‌రూ నోరు విప్పింది లేదు. వీరు మాత్ర‌మే కాదు.. ప్ర‌తి విష‌యంలోనూ చురుగ్గా స్పందించే ఎంపీ క‌విత సైతం రియాక్ట్ అయ్యింది లేదు. ఎందుకిలా? అన్న‌ది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు పార్టీకి న‌ష్టం వాటిల్లేలా ఉన్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించినందుకే.. ఆ విష‌యాన్ని కంటిన్యూ చేయ‌కుండా అక్క‌డితో ముగిసిన‌ట్లుగా కామ్ అయిపోయార‌ని చెబుతున్నారు.

మామూలుగా అయితే విపక్షాల కౌంట‌ర్ కు అటాక్ చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా విపక్షాలు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కుండా మౌనంగా ఉండిపోవ‌టం చూస్తే.. కోదండంపై కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కోదండంపై కేసీఆర్ చేసిన దూష‌ణ‌ల్ని త్వ‌ర‌గా మ‌ర్చిపోయేలా మ‌రో అంశం మీద మాట్లాడుతూ.. ప్రాధాన్య‌తల్ని మార్చుకోవాల‌న్న ఆలోచ‌న‌లో గులాబీ ముఖ్య‌నేత‌లు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.