Begin typing your search above and press return to search.

అందుకే.. కేటీఆర్ కడుపు మండుతోందా?

By:  Tupaki Desk   |   5 Dec 2017 5:22 AM GMT
అందుకే.. కేటీఆర్ కడుపు మండుతోందా?
X
మంత్రి కేటీఆర్‌కు కోపం వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌న ఆయ‌న‌కు అదే ప‌నిగా చిరాకుతో కూడిన కోపం వ‌చ్చ‌స్తుంది. అమాయ‌క‌పు మీడియా రిపోర్టర్లు ఏదైనా అడిగితే చాలు క‌సుక్కున కోపం వ‌చ్చేస్తోంది. సామాన్యుడు అడిగితే మాత్రం కాస్త స‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న ఆయ‌న‌కు రాజ‌కీయ నేత‌లు ఎవ‌రైనా ప్ర‌శ్న‌లు వేస్తే కాలిపోతోంది.

అరే.. ప‌ని చేసుడే కాక‌.. ఇదే అడుగుడేంది భ‌య్ అంటూ ఆయ‌న గుస్సా అవుతున్నారు. నిజ‌మే మ‌రి కోట్లాడి సాధించిన తెలంగాణ‌లో క‌ష్ట‌ప‌డిన ప‌ని చేస్తున్న స‌ర్కారును నిలదీస్తే ఎవ‌రికి మాత్రం కోపం రాకుండా పోతుంది. ఉమ్మ‌డిగా ఉన్న అర‌వైఏళ్ల‌లో చేసిన అప్పు భాగాన్ని.. నాలుగేళ్లలో అంతే మొత్తాన్ని అప్పు చేయ‌టం చిన్న ముచ్చ‌టా ఏంది? ఇప్ప‌టికిప్పుడు మీ చేతికి కోటి రూపాయిలు ఇచ్చేసి ఖ‌ర్చు చేయ‌మంటే నొప్పి తెలుస్తుంది. అలాంటిది దాదాపు 60వేల కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం ఎంత ఒత్తిడితో కూడుకున్న ప‌ని.

ఆ క‌ష్టాన్ని గుర్తించ‌కుండా ఏంత‌సేప‌టికి అప్పు చేశారు.. అప్పు చేశార‌ని అడుగుడే కానీ.. అరే.. అప్పు ఎందుకు చేస్తున్నార‌న్న మాట‌ను ముచ్చ‌ట‌గా అడిగితే ఎంత బాగుంటుంది. అర‌వైఏళ్ల‌లో దిక్కుమాలిన పాల‌కులు పాల‌న స‌రిగా చేయ‌కుండా.. ఖ‌ర్చు పెట్టుడు చేత‌కాకపోవ‌టంతో ఇప్పుడు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌న్న చిన్న ముచ్చ‌ట‌ను అర్థం చేసుకోక‌పోవ‌టం బాధ క‌లిగించేదే క‌దా? అంతేనా.. ముందు ఖ‌ర్చు చేయ‌డు.. ఆ త‌ర్వాత ఆ ఖ‌ర్చుకు త‌గ్గ ఫ‌లితం వ‌చ్చే వేళ‌లో ఉపాధి అవ‌కాశాలు త‌న్నుకుంటూ వ‌స్తాయి కానీ.. పాల‌న చేప‌ట్టి ప‌ట్టుమ‌ని నాలుగేళ్లు పూర్తి కాక‌ముందే ఉద్యోగాలు ఇవ్వ‌మ‌ని నిల‌దీయ‌టం ఎంత అవ‌మానం.. ఎంత అవ‌మానం.

అందుకే మండిపోతోంది కేటీఆర్‌ కు. అమెరికాలో తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేసి.. ఏకాఏకిన ఉద్య‌మంలోకి దూకేసి.. ఎన్ని త్యాగాలు చేశాక అధికారం వ‌చ్చింది. అమెరికాలో ఉద్యోగం వ‌దిలేసింది తెలంగాణ ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రించ‌టానికి కానీ.. ఉత్త‌మ్‌.. భ‌ట్టి.. కోదండం మాష్టారిలా నిరుద్యోగిలా దేబిరించ‌లేదు క‌దా. చేస్తే.. గీస్తే ఏదైనా తాము మాత్ర‌మే చేయాలే త‌ప్పించి.. ఎవ‌రు ప‌డితే వారు ఉద్య‌మాలు.. పోరాటాలు.. నిర‌స‌న‌లంటే కేటీఆర్ కు ఎంత కష్టంగా ఉంటుంది.

ఉద్య‌మాలు ఎలా చేయాలి..? నిర‌స‌నలు.. ఆందోళ‌న‌లు ఎలా చేయాలో నేర్పించిన త‌మ‌కే పాఠాలు చెబుతానంటే కోపం రాకుండా ఉంటుందా ఏంది? అందుకే..కొలువుల కోట్లాట అంటూ ప్రోగ్రాంను కోదండం మాష్టారు ప్ర‌క‌టించినంత‌నే కోపం వ‌చ్చేసింది. కొలువు ఉన్న‌ప్పుడు తెల‌గాణ కోసం కోట్లాడిన కోదండం మాష్టారిలో త‌ప్పు క‌నిపించ‌ని కేటీఆర్‌కు.. రిటైర్ అయ్యాక చేయ‌టం చాలా గుస్సా వ‌చ్చేసింది. కొలువు ఉన్న‌ప్పుడు అంటే.. జీతం తీసుకుంటాడు కాబ‌ట్టి ఉద్య‌మాలు గ‌ట్రా చేసినా త‌ప్పు లేదు. రిటైర్ అయి.. పెన్ష‌న్ డ‌బ్బులు చేతిలోకి వ‌చ్చాక రామా.. కృష్ణా అని ఓప‌క్క కూర్చొని భ‌జ‌న చేయ‌టం మానేసి.. ప్ర‌భుత్వం మీద ప‌డితే చిరాకు పుట్ట‌దా ఏంది?

త‌న లాంటి ఫారిన్ రిట‌ర్న్స్ ప్ర‌భుత్వాన్ని న‌డిపేస్తూ.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ గారి అమ్మాయి ప‌క్క‌న కూర్చొని అదిరిపోయే ప్ర‌సంగాలు ఇస్తున్న వేళ‌లో.. తెలంగాణ పోర‌డు ఎంత‌గా దూసుకుపోతున్నాడో చూసి సంతోషించాల్సింది పోయి.. కొలువుల కోట్లాట అంటూ స‌ర్కారుతో గొడ‌వ‌క దిగ‌టంలో అర్థం ఏమైనా ఉందా?