Begin typing your search above and press return to search.

కేటీఆర్ స‌వాల్‌ కు అస‌లు కార‌ణం

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:03 AM GMT
కేటీఆర్ స‌వాల్‌ కు అస‌లు కార‌ణం
X
గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస ఓడితే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మరి వారి పార్టీలు ఓడితే విపక్ష నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తారా? కాంగ్రెస్‌ - టీడీపీ - బీజేపీ పార్టీల నేతలు నా సవాల్‌ ను స్వీకరించేందుకు ముందుకు వస్తారా? ఇది తెలంగాణ మంత్రి-సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ప్రతిపక్షాలకు విసిరిన స‌వాల్‌. ఏ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అయినా ఆయా పార్టీల‌కు గెలుపుపై ధీమా ఉంటుంది. క‌చ్చితంగా గెలుస్తామ‌నే భ‌రోసా ఉంటుంది. అయితే ఇలా మంత్రి ప‌ద‌విని సైతం తృణ‌ప్రాయంగా వ‌దులుకోగ‌ల ధీమా సాధించ‌డం, ఏకంగా బ‌హిరంగ స‌వాల్ విస‌ర‌డం ఆస‌క్తిక‌రం.

గ్రేటర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఏకై క లక్ష్యంతో అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీఆర్ ఎస్‌ లోనే కాకుండా రాజ‌కీయ నాయ‌కుల్లో అందరి చూపు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వైపే ఉంది. రాష్ట్ర రాజకీయాలనే కాదు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు కూడా కేటీఆర్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రతిపక్ష నేతలకు ఆయన విసురుతున్న సవాళ్లు సంచలనంగా మారాయి. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే కేటీఆర్ విసిరిన స‌వాల్ వెనుక రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్తున్నారు. గ్రేటర్‌లో కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందన్న ధీమా కేటీఆర్ విసిరిన స‌వాల్ వెనుక ఒక కార‌ణం కాగా మ‌రొక‌టి ప్రతిపక్షాల స్థయిర్యాన్ని మానసికంగా దెబ్బతీసే సరికొత్త రాజకీయ క్రీడ అని భావిస్తున్నారు.

బ‌హిరంగ ఛాలెంజ్‌ చేయడం, ఇందులో భాగంగా మంత్రి ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని చెప్ప‌డం ద్వారా గెలుపు విష‌యంలో ప్ర‌తిప‌క్షాల‌ను డిఫెన్స్‌ లో ప‌డేసిన‌ట్లు అవుతుంద‌ని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. త‌ద్వారా ఆయా పార్టీలు త‌మ గెలుపుకోసం పెద్ద‌గా శ్ర‌మించ‌కుండా ఒక‌ర‌క‌మైన నిస్తేజంలో ప‌డిపోయేదిశ‌గా కేటీఆర్ స్టేట్‌ మెంట్ కార‌ణం అవుతుంద‌ని చెప్తున్నారు. ఇదిలాఉండ‌గా కేటీఆర్ స‌వాల్‌ కు టీడీపీ వెంట‌నే స్పందించింది. గ్రేట‌ర్ ఎమ్మెల్యే ల గెలుపు కాకుండా..పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెల‌వాల‌ని కోరింది. కాంగ్రెస్‌ - బీజేపీలు స్పందించ‌లేదు.