Begin typing your search above and press return to search.

కోదండంను కేటీఆర్ అన్ని తిట్ల వెనుక లెక్క ఇదే!

By:  Tupaki Desk   |   1 Oct 2018 6:53 AM GMT
కోదండంను కేటీఆర్ అన్ని తిట్ల వెనుక లెక్క ఇదే!
X
తెలంగాణ‌లో ముంద‌స్తు వేడి ఇప్ప‌టికే రాజుకున్న సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి టీఆర్ఎస్‌కు అధికారం చేతికి చిక్క‌కుండా ఉండాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో విప‌క్షం ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్లే కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా భిన్న‌ధ్రువాలైన పార్టీలు ఒక ద‌గ్గ‌ర‌కు చేరి కూట‌మిగా త‌యార‌వుతున్న వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ ను ఆ ర‌కంగా అడుక్కుంటారా? అంటూ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం అంటే.. కోదండం మాష్టారి ప్ర‌భావం ఎంత ఉంద‌న్న విష‌యం ఆయ‌న మాట‌ల్ని చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. టీఆర్ఎస్ కు మొద‌ట్నించి ఉన్న ఒక అల‌వాటు ఏమంటే..త‌మ‌కు ఎవ‌రైతే ఇబ్బందిగా మార‌తారో వారి మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతుంటారు.

ఎంత మాట అనేందుకైనా వెనుకాడ‌ని త‌త్త్వం క‌నిపిస్తుంది. వారి మాట‌లు ప్ర‌భావం చూపించి.. ఒక్క‌సారి కానీ ప్ర‌త్య‌ర్థుల బ‌లం త‌గ్గిందా.. వారి గురించి మాట్లాడటం ఆపేస్తారు. బ‌ల‌వంతుల మీద పోరాటం చేయ‌టం గులాబీ నేత‌ల‌కు మొద‌ట్నించి అల‌వాటు. ఈ రోజు మాట‌కు ముందు ఒక‌సారి.. వెనుక ఒక‌సారి కోదండం మాష్టారిని.. కాంగ్రెస్ ను అదే ప‌నిగా తిట్టి పోస్తున్నారంటే.. వారి కాంబ‌నేష‌న్ కార‌ణంగా త‌మ‌కు రాజ‌కీయంగా ఎంత ఇబ్బంద‌న్న విష‌యం కేసీఆర్ అండ్ కోకు తెలియంది కాదు.

ఈ కార‌ణంతోనే వారు అదే ప‌నిగా విరుచుకుప‌డుతున్నార‌ని చెప్పాలి. కేసీఆర్ బాధ్య‌త‌ల్ని కేటీఆర్ తీసుకోవ‌ట‌మే కాదు.. స‌మ‌ర్థంగా పోషిస్తున్నారా? లేదా? అన్న ఉద్దేశంతో టెస్టింగ్ కోసం కేటీఆర్ ను ప్ర‌యోగిస్తున్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే కేసీఆర్ అస్స‌లు బ‌య‌ట‌కు రావ‌టం లేదు. అదే స‌మ‌యంలో ఆయ‌న ఏం చేస్తున్నారో ఎవ‌రికి అర్థం కాని ప‌రిస్థితి.

కొన్ని ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న ప‌లువురు నేత‌ల‌తో క‌లుస్తున్నార‌న్న‌ది కూడా అబ‌ద్ధ‌మ‌ని చెబుతున్నారు. కేవ‌లం వార్త‌ల రూపంలో అలా వ‌స్తున్నా.. వాస్త‌వం మాత్రం వేరుగా ఉంద‌ని తెలుస్తోంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాకుండా.. త‌న‌కు బ‌దులుగా కేటీఆర్‌ను రంగంలోకి దించ‌టం.. ప‌లు ప్రాంతాల్లో స‌భ‌లు పెట్టించ‌టం వెనుక అస‌లు ఉద్దేశం త‌న వార‌సుడ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేయ‌టం. చూసినోళ్లంద‌రికి కేటీఆర్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడ‌న్న భావ‌న క‌ల‌గ‌టంతో పాటు.. స‌మ‌ర్థుడేన‌న్న భావ‌న వ‌స్తే అధికార బ‌దిలీ తేలిక‌గా సాగ‌ట‌మే కాదు.. వార‌సుడి ప‌ట్టాభిషేకానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

ఇందులో భాగంగా త‌మ‌కు ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉన్న కూట‌మిని విచ్చిన్నం చేయ‌టానికి వీలుగా..కోదండం మాష్టారి లాంటి వారి మ‌న‌సు చివుక్కుమ‌నేలా వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని చెప్పాలి. కాంగ్రెస్‌.. టీడీపీతో పొత్తు కంటే కూడా..ఈ రెండు పార్టీల‌కు కోదండం మాష్టారు.. సీపీఐలు క‌లిస్తే భారీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌ట‌మే కాదు.. టీఆర్ఎస్‌కు షాక్ త‌గిలే అవ‌కాశం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఈ కార‌ణంతోనే కేటీఆర్ నోటి నుంచి అదే ప‌నిగా ముష్టి మూడు సీట్ల కోసం కోదండం మాష్టారు అంత‌లా దేబిరించాలా? అన్న ప‌రుష మాట వ‌స్తుంద‌ని చెప్పక త‌ప్ప‌దు.