Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు.. బాహుబ‌లి 3కు క‌నెక్ష‌న్ ఏంది?

By:  Tupaki Desk   |   6 Dec 2017 3:30 PM GMT
కేటీఆర్‌ కు.. బాహుబ‌లి 3కు క‌నెక్ష‌న్ ఏంది?
X
క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ప్ర‌చారం చేసుకోవ‌టం ద్వారా స‌క్సెస్ సాధించే వ్యూహాన్ని అనుస‌రించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీహ‌బ్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నార‌ని చెప్పాలి. త‌మ హ‌యాంలో మొద‌లుకాని టీ హ‌బ్‌ను.. త‌మ‌కు తాము సొంతం చేసుకోవ‌ట‌మే కాదు.. పాత ప్రాజెక్టుకు స‌రికొత్త హంగులు అద్ది.. మొత్తం క్రెడిట్‌ను తీసుకోవ‌టంలో కేటీఆర్ తెలివిని మెచ్చుకోవాలి.

టీహ‌బ్ విజ‌యాన్ని జాతీయంగా ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకున్న తెలంగాణ‌రాష్ట్ర స‌ర్కారు.. ఇటీవ‌ల వ‌చ్చి వెళ్లిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక సైతం గుర్తించేలా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యారు. ఇందులో ఐటీ మంత్రి కేటీఆర్ కృషిని త‌ప్ప‌నిస‌రిగా కోట్ చేయాల్సిందే. టీహ‌బ్ తో వ‌చ్చిన మైలేజీని మ‌రింత పెంచుకోవ‌టంతో పాటు.. త‌మ‌దైన ప్రాజెక్టుగా టీ వ‌ర్క్స్ ను కేటీఆర్ ప్ర‌మోట్ చేస్తున్నారు.

తాను చేసే విష‌యాల్ని.. చేయ‌బోయే విష‌యాల్ని వ్యూహాత్మ‌కంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే మంత్రి కేటీఆర్‌.. తాజాగా టీవ‌ర్క్స్ గురించి ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. ఇంతా బాగుంది.. టీ వ‌ర్క్స్ కి.. బాహుబ‌లి 3 లింకేంటి? హెడ్డింగ్ లో బాహుబ‌లి 3 గురించి చెప్పి.. ఇప్ప‌టివ‌ర‌కూ దాని మాటే చెప్ప‌రేంట‌న్న డౌట్ వ‌చ్చిందా? ఆగండాగండి.. అక్క‌డికే వ‌స్తున్నాం.

టీవ‌ర్క్స్ కు సంబంధించి మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ.. తాజా ప్రాజెక్టుతో హైద‌రాబాద్‌ ను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్ల‌నున్నట్లు ప్ర‌క‌టించారు. టీ వ‌ర్క్స్ కోసం దాదాపు 20 మిలియ‌న్ డాల‌ర్ల యంత్ర‌సామాగ్రిని వినియోగించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

టీ వ‌ర్క్స్ తో అత్యాధునిక సాంకేతిక‌త అందుబాటులోకి రావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బాహుబ‌లి నిర్మాత‌ల్లో ఒక‌రైన శోభు యార్ల‌గ‌డ్డ రియాక్ట్ అయ్యారు. టీవ‌ర్క్స్ ప్రాజెక్టు అత్య‌ద్భుత‌మ‌ని.. మ‌రిన్ని ప్ర‌యోగాలు చేసేందుకు టీ వ‌ర్క్స్ అవ‌కాశం ఇస్తుంద‌ని.. ఎంతోమంది క‌ల‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఇదో గొప్ప ప్రారంభంగా అభివ‌ర్ణించారు.

త‌న ట్వీట్ల‌కు స్పందించిన ప్ర‌తి ప్ర‌ముఖుడికి త‌ప్ప‌నిస‌రిగా స‌మాధానం ఇచ్చే అల‌వాటున్న కేటీఆర్‌.. శోభు లాంటి వ్య‌క్తి చేసిన ట్వీట్‌ను వ‌దిలేస్తారు. త‌న‌దైన శైలిలో రియాక్ట్ అవుతూ.. శోభుకు ధ‌న్య‌వాదాలు చెబుతూ.. టీవ‌ర్క్స్ తో బాహుబ‌లి 3కి అవ‌స‌ర‌మైన సాంకేతిక అందుబాటులోకి వ‌స్తుందంటూ చ‌మ‌త్క‌రించారు. పొలిటిక‌ల్ లీడ‌ర్లు.. సినిమా వాళ్లు చెట్టాప‌ట్టాలు వేసుకోవ‌టం మామూలే అయినా.. సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖునితో కేటీఆర్ చేసిన స‌ర‌దా కామెంట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.