Begin typing your search above and press return to search.

టీడీపీలోకి ల‌గ‌డ‌పాటి?..బాబుతో భేటీలు అందుకేనా?

By:  Tupaki Desk   |   29 Jan 2019 2:41 PM GMT
టీడీపీలోకి ల‌గ‌డ‌పాటి?..బాబుతో భేటీలు అందుకేనా?
X
ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌... అప్ప‌టిదాకా పారిశ్రామిక‌వేత్త‌గానే ఉన్నా... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దిక్కుగా మారిన స‌మ‌యంలో ఏకంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి కీల‌క నేత‌గా ఎదిగారు. విజ‌య‌వాడ ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి... ఒక్క కృష్ణా జిల్లాలోనే కాకుండా తెలుగు నేల రాజ‌కీయాల్లోనే పేరొందిన నేత‌గా ఎదిగారు. ఈ ఎదుగుద‌ల పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించేదాకా వెళ్ల‌లేదు గానీ... బ‌య‌ట‌కు వ‌స్తే మాత్రం మీడియా మొత్తాన్ని త‌న వైపున‌కు తిప్పుకునే స్థాయికి ఎదిగిపోయారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న‌ను పూర్తిగా వ్య‌తిరేకించిన ల‌గ‌డ‌పాటి... పెప్ప‌ర్ స్ప్రే తో పార్ల‌మెంటులోకి వెళ్లి.... హ‌ల్ చ‌ల్ చేసి దేశ‌వ్యాప్త గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ల‌గ‌డ‌పాటి ఎంత గింజుకున్నా... ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు నేల‌ను విభ‌జించేసింది. ఆ స‌మ‌యంలో ఏదో ఉద్రేకంలో రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పిన ల‌గ‌డ‌పాటి... పాలిటిక్స్‌ కు దూరం జ‌రిగేందుకు మాత్రం స‌సేమిరా అంటున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం అంటూనే ఆర్జీ ఫ్లాష్ టీంతో స‌ర్వేలు చేయిస్తూ... ఆంధ్రా ఆక్టోప‌స్‌ గా పేప‌రుగాంచారు. అయితే ఆ క్రెడిబిలిటీ కూడా మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో పూర్తిగా కొట్టుకుపోయింది.

అయినా అలా త‌న క్రెడిబిలిటీ కొట్టుకుపోతుంద‌ని తెలిసినా... ల‌గ‌డ‌పాటి ఎందుకు అంత దుస్సాహ‌సం చేశార‌న్న అంశంపై నాడు పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌కు ఇప్పుడు ఆన్స‌ర్ దొరికింద‌నే చెప్పాలి. తెలంగాణ‌లో ఘోరాతి ఘోరంగా ఓడిన టీడీపీ... ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో చాలా చోట్ల ఆ పార్టీకి దిమ్మ‌తిరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కొంద‌రు నేత‌లు పార్టీలోకి వ‌స్తున్నా... కొంద‌రు నేత‌లు ఝ‌ల‌క్కిస్తూ పార్టీని వీడుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా వ‌ద్ద‌నే ప‌రిస్థితి లేద‌న్న‌ది టీడీపీ మాట‌గా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని భావించిన లగ‌డ‌పాటి మళ్లీ రాజ‌కీయాల్లోకి పునఃప్ర‌వేశించాల‌ని - అది కూడా టీడీపీ ద్వారానే త‌న రీ ఎంట్రీ ఉండాల‌ని భావిస్తున్నారు. అందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ర‌చించుకున్న ల‌గ‌డ‌పాటి... మొన్నామ‌ధ్య ఉండ‌వ‌ల్లికి వెళ్లి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత త‌న ఇంటిలో జ‌రిగిన ఓ వేడుక‌కు కూడా చంద్ర‌బాబును ర‌ప్పించుకోగ‌లిగారు. ఈ వేడుక అయ్యిందో - లేదో... వెంట‌నే మ‌ళ్లీ బాబు వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్టారు.

ఈ సారి బ‌హిరంగంగా కాదు. చాలా ర‌హ‌స్యంగా జ‌రిగిన ఈ భేటీకి ల‌గ‌డ‌పాటి త‌న వెంట బాబు వ‌ద్ద‌కు ఓ మీడియా పెద్ద‌ను కూడా తీసుకెళ్లారు. గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించుకున్నా... ఆ సారాంశ‌మేమిటో బ‌య‌ట‌కు రాలేదు. అయితే ఈ విష‌యంలో ఇరువ‌ర్గాలు బ‌య‌ట‌ప‌డ‌కున్నా.. ల‌గ‌డ‌పాటి రాజ‌కీయ పునఃప్ర‌వేశం దిశ‌గానే అడుగులు వేస్తున్నార‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న స‌ర్వేల‌తో టీడీపీ ప‌రువు తీసేసిన ల‌గ‌డ‌పాటిని చంద్ర‌బాబు త‌న పార్టీలోకి చేర్చుకుంటారా? అన్న‌ది ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఇదే డౌటు వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి కూడా చంద్ర‌బాబు నుంచి నో అనే స్పంద‌న రాకుండా చూసేందుకే త‌న వెంట ఓ మీడియా పెద్ద‌ను తీసుకెళ్లార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. మ‌రి ల‌గ‌డ‌పాటి ఇంత‌గా య‌త్నిస్తున్నా... చివ‌రకు ఏం జ‌రుగుతుంద‌న్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.