Begin typing your search above and press return to search.

మోదీతో మమతా బెనర్జీ రాజీ ప్రయత్నాలకు కారణం అదేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:30 AM GMT
మోదీతో మమతా బెనర్జీ రాజీ ప్రయత్నాలకు కారణం అదేనా?
X
తృణమూల్‌ కాంగ్రెస్‌ - బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి. మొన్నటి ఎన్నికల ముందు మోదీపై మమత తీవ్రస్థాయిలో మాటల దాడి చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ - తృణమూల్ కార్యకర్తలు ఒకరినొకరు చంపుకొంటున్న పరిస్థితి. అలాంటి రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మమతాబెనర్జీ మోదీ జన్మదినం సందర్భంగా దిల్లీ వచ్చి మోదీని కలిసి బెంగాలీ మిఠాయిలు - ప్రత్యేకమైన బెంగాలీ కుర్తాలు తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చారు. ఇదే మమత.. మొన్నటి ఎన్నికల సమయంలో మోదీ అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఏటా మమత బెంగాలీ స్వీట్లు - రెండు కుర్తాలు పంపిస్తారని చెప్పగా.. ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ - ఈసారి రాళ్ల - కంకరతో చేసిన స్వీట్లు పంపిస్తానంటూ మండిపడ్డారు. కానీ, ఇప్పుడు అదే మమత ఎప్పటిలా స్వీట్లు - కుర్తాలు తీసుకుని వెళ్లి మోదీని కలిసొచ్చారు. మూడు నెలల్లోనే ఎందుకింత మార్పు వచ్చింది.. మమత ఎందుకు మోదీని చూసి భయపడుతోందన్న ప్రశ్నలు దేశమంతటా వినిపిస్తున్నాయి.

బెంగాల్‌లో చిట్ ఫండ్ స్కాముల్లో మమత - ఆమె పార్టీ నాయకులు పీకల్లోతు ఆరోపనల్లో కూరుకుపోవడంతో ఇప్పుడు కేసుల భయంతో దారికొచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ, అసలు విషయం అది కాదని దిల్లీ స్థాయిలో వినిపిస్తోంది. మమతను బలవంతంగా సీబీఐతో అరెస్టు చేయించి ఆమెకు సానుభూతి వచ్చే పనులు మోదీ చేసే అవకాశం లేదు.. మోదీ ఏదీ అంచనాలకు అందనట్లగానే చేస్తారని.. ఇప్పుడు మమతను దారికితేవడానికి ఆయన వద్ద మాస్టర్ స్ట్రోక్ ఒకటుందని.. ఆ సంగతి అర్థం చేసుకునే మమత దిగొచ్చిందని చెబుతున్నారు.

ఇంతకీ మమత అంతలా కంగారు పడి పరుగులు తీస్తూ మోదీ - అమిత్ షాలను కలవడానికి కారణం గూర్ఖాలాండ్ ను బెంగాల్ నుంచి విభజించేందుకు బీజేపీ యోచించడమేనని తెలుస్తోంది. దశాబ్దాల డిమాండైన గూర్ఖాలాండ్‌ ను ఏర్పాటు చేస్తే మమత హవా తగ్గిపోతుందని - కొద్ది ప్రాంతానికే ఆమె పరిమితమైపోతుందని - అప్పుడు బీజేపీ పట్టు సాధించే అవకాశముంటుందని ఆలోచిస్తున్నారట. ఈ ఎత్తుగడను ఊహించిన మమత దారికొచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆమె వారం కిందటే తన రూటు మార్చారు. సెప్టెంబరు 12న ఎన్‌ ఆర్‌ సీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో మెతక వైఖరి ప్రదర్శించారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని - ప్రధానమంత్రి కుర్చీకి గౌరవం ఉంటుందని - విమర్శలు చేయబోనని చెప్పారు. ఆ తరువాత బుధవారం మోదీని - గురువారం అమిత్‌ షాను కలవడంతో మమత పూర్తిగా బీజేపీకి సాహో అనేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ అపాయింటుమెంటు ఇవ్వడమే అందుకు సూచనని చెబుతున్నారు.

ఇకపోతే మోదీనికి కలవడానికి వెళ్తున్న సమయంలో దీదీకి ఊహించని వ్యక్తి కోల్ కతా ఎయిర్ పోర్టులో ఎదురయ్యారు. కోల్‌ కతా విమానాశ్రయంలో ఆమెకు మోదీ సతీ మణి జశోదా బెన్‌ కనిపించారు. ఆమెను చూసిన మమతా బెనర్జీ ఆమెతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆమెకు దీదీ ఆమెకు ఓ చీర ను బహూకరించారు. జశోదా బెన్‌ జార్ఖండ్‌ లోని ధన్‌ బాద్‌ కు వెళ్లేందుకు కోల్ కతాలో దిగారు.