Begin typing your search above and press return to search.

మాయావ‌తి బీజేపీ బుట్ట‌లో ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   4 Oct 2018 2:30 PM GMT
మాయావ‌తి బీజేపీ బుట్ట‌లో ప‌డ్డారా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - రాజ‌స్థాన్‌ - ఛ‌త్తీస్‌ గ‌ఢ్ ఎన్నిక‌లు కాంగ్రెస్‌ - బీజేపీల‌కు అత్యంత కీల‌క‌మైన‌వి. అందుకే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎన్నెన్నో వ్యూహాలు ర‌చిస్తోంది. పొత్తుల‌తో త్యాగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే, నిన్నామొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌ తోనే ఉన్న‌ట్లు క‌నిపించిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి స‌డ‌న్‌ గా ఆ పార్టీకి షాకిచ్చారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఎస్పీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఇన్నాళ్లూ హ‌స్తం పార్టీతో స‌న్నిహితంగా మెలిగిన మాయావ‌తి ఇంత స‌డెన్‌గా ఎందుకు త‌న వైఖ‌రి మార్చుకున్నారు? దేశ‌వ్యాప్తంగా జ‌నాల మెద‌ళ్ల‌ను తొలిచేస్తున్న ప్ర‌శ్న ఇది.

మాయావ‌తి అవ‌కాశ‌వాదురాల‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ఉంది. గ‌తంలో ఆమె చాలాసార్లు త‌న పార్టీ భాగ‌స్వాములను మార్చుకున్నారు. కూట‌ములు మారారు. అయితే, కూట‌మి ఏర్పాటు దాదాపు ఖాయ‌మ‌య్యాక‌.. ఎన్నిక‌లు స‌మీపించాక ఒక్క‌సారిగా మాయావ‌తి ప్లేటు ఫిరాయించ‌డం పైనే ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌ కు దూరంగా ఉండాల‌న్న‌ ఆమె నిర్ణ‌యం క‌చ్చితంగా బీజేపీకి అనుకూలించేదే. అయితే, ఆమె నిర్ణ‌యం వెనుక కార‌ణాలేంటన్న‌దానిపై రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు వాద‌న‌లు - విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. వాటిలో ఓ కోణం.. కేసులు. మాయావ‌తిపై ప్ర‌స్తుతం చాలా కేసులున్నాయి. ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) - సీబీఐ ఆ కేసుల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నాయి. ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే త‌మ స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రంటూ మాయావ‌తిని బీజేపీ కంగారుపెట్టి ఉండొచ్చ‌ని.. ప‌రిస్థితి అర్థం చేసుకున్న ఆమె కాంగ్రెస్‌ కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకొని ఉండొచ్చ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

ఇక మాయావ‌తి నిర్ణ‌యం వెనుక వినిపిస్తున్న మ‌రో ఆస‌క్తిక‌ర అంశం.. ఉప ప్ర‌ధాని ప‌ద‌వి. ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తామంటూ మాయావ‌తిని బీజేపీ ఆక‌ర్షించింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే కాంగ్రెస్‌ తో కూట‌మిపై ఆమె వెన‌క్కి త‌గ్గార‌ని అంచ‌నా వేస్తున్నాయి. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. మాయావ‌తికి బీజేపీ ఉప ప్ర‌ధాని ప‌ద‌విని ఎప్పుడు ఇవ్వ‌గ‌ల‌దు? ప‌్ర‌స్తుత ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం దాదాపుగా ముగింపు ద‌శ‌కొచ్చింది. కాబ‌ట్టి ఇప్పుడే ఆమె ప‌ద‌విని చేప‌ట్ట‌లేదు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్క‌క‌పోతే.. ప్ర‌భుత్వ ఏర్పాటులో ఆ పార్టీకి మాయావ‌తి స‌హ‌క‌రిస్తేనే ఆమెకు ఉప ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి మాయావ‌తిని బీజేపీ త‌న వ్యూహంతో బుట్ట‌లో వేసుకుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.