Begin typing your search above and press return to search.

వరాల మూటను మోడీ అందుకే విప్పలేదా?

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:37 AM GMT
వరాల మూటను మోడీ అందుకే విప్పలేదా?
X
ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోడీ నోటి వెంట.. ఏపీకి ఎన్నోకొన్ని వరాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. మరి.. బీహార్ రాష్ట్రానికి ప్రకటించిన చందంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనూ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఉద్దేశ్యం మొదటి నుంచి మోడీ సర్కారుకు లేదన్న విషయం తెలిసిందే. అయితే.. విభజన కారణంగా మొత్తంగా చతికిల పడిపోయిన ఏపీకి కాస్తంత ఉత్సాహాన్ని ఇచ్చే రీతిలో వరాలు ప్రకటించటం అసాధ్యమైన విషయమేమీ కాదు.

కానీ.. మోడీ నోటి నుంచి ఆ దిశగా ఒక్కమాట కూడా రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిని నెరవేస్తామని చెప్పారే కానీ.. దానికి నిర్ణీత కాలపరిమితిని కూడా ప్రస్తావించలేదు. అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం మోడీ సర్కారు కృషి చేస్తూ ఉంటుందన్నమాట. ఇక.. మోడీ నోటి నుంచి ఎలాంటి వరాలు రాకపోవటానికి కారణమేమిటి? దాని వెనుకున్న రాజకీయ వ్యూహమేమిటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్న వాదన ఒకటుంది.

ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తే.. రాజకీయంగా ఇబ్బంది అవుతుందన్న కారణం కూడా ఉండి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఏపీకి వరాల మూట విప్పినందు వల్ల పార్టీకి చేకూరే ప్రయోజనం శూన్యం. దీనికి తోడు.. వేదిక మీద మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో.. ఏపీకి వరాలు విదిలిస్తే.. వేదిక మీదున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తమ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చే వీలుందన్న ముందుచూపుతో ఏపీకి ఎలాంటి వరం ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు.

అనుకుంటాం కానీ.. ప్రధాని స్థాయి వ్యక్తి కానీ ఏదైనా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని డిసైడ్ కావాలే కానీ.. దాన్ని అడ్డుకునే శక్తి ఏది ఉంటుంది? మోడీ మనసులో లేని ఏపీకి ఆయన ఏదో చేస్తాడని నమ్మకం పెట్టుకోవటం మనల్ని మోసగించటానికి మరోసారి మనమే అవకాశం ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు. మోడీ లాంటి వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవటం వృధా ప్రయాసే.