Begin typing your search above and press return to search.

మోదుగుల ఎందుకు వెళ్లిపోయారంటే..?

By:  Tupaki Desk   |   6 March 2019 3:30 AM GMT
మోదుగుల ఎందుకు వెళ్లిపోయారంటే..?
X
అందరూ అనుకున్నట్లే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని స్పీకర్‌ కోడెలకు ఫ్యాక్స్ చేశారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వదిలి వెళ్లిపోతారని టీడీపీ వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే. మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలోకి వెళ్లిపోతున్నాడని వారం రోజుల క్రితమే ఒక ప్రముఖ దిన పత్రిక తన ఈ పేపర్ ఎడిషన్‌ లో పెట్టింది. ఇక మొన్నటికి మొన్న గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ రివ్యూకి కూడా ఆయన రాలేదు. దీంతో. అందరూ ఊహించినట్లుగానే మోదుగుల టీడీపీకి రాజీనామా చేశారు. రెండు రోజుల్లో వైసీపీలో చేరతారు.

టీడీపీ నుంచి మోదుగుల వైదొలగడానికి చాలా కారణాలున్నాయి. మొదటి నుంచి ఆయనకు పార్టీలో సరైన గౌరవం లేదు. అసలు టీడీపీలో మోదుగుల అనే ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఆయన మీడియాకు ఎప్పుడూ కన్పించరు. కన్పించరు అనడం కంటే కన్పించనివ్వరు అనడం కరెక్ట్‌. అదీగాక మోదుగులకు ఎమ్మెల్యే కంటే ఎంపీగా పోటీచేయడం అంటేనే ఇష్టం. 2009లో మోదుగుల ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత కూడా ఎంపీగా పోటీ చేస్తానంటే చంద్రబాబు ఒప్పుకోలేదు. గుంటూరు ఈస్ట్‌ నుంచి పోటీ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో.. తప్పక మనసు చంపుకుని - అవమానాలు భరించి పోటీ చేశారు. కన్నాపై గెలిచారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎంపీ టిక్కెట్‌ అడిగారు. అయితే.. ఎంపీ టిక్కెట్‌ సంగతి పక్కడ పెడితే.. ఎమ్మెల్యే టిక్కెట్‌ కూడా వస్తుందో రాదో తెలీని పరిస్థితి మోదుగులకు ఎదురైంది. అందుకే.. ఇన్ని అవమానాలు భరించలేకే ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ కూడా మోదుగులను వదిలించుకున్నామని అంటుందంటే.. ఆయనకు జరిగిన అవమానాలు ఎలాంటివో మనమే అర్థం చేసుకోవచ్చు.