Begin typing your search above and press return to search.

పవన్ చాలడని కొత్తగా ముద్రగడ చెప్పాలా?

By:  Tupaki Desk   |   11 Feb 2018 4:54 AM GMT
పవన్ చాలడని కొత్తగా ముద్రగడ చెప్పాలా?
X
ప్రత్యేకహోదా మీద ఉద్యమం సాగించడానికి - పోరాటాన్ని లీడ్ చేయడానికి పవన్ కల్యాణ్ చాలడని ముద్రగడ పద్మనాభం అంటున్నారు. పవన్ కల్యాణ్ ను కాపు సామాజిక వర్గం యావత్తూ.. తమ ఆరాధ్య నాయకుడిగా కొలుస్తోంటే.. అదే సామాజికవర్గం నుంచి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలని నిత్యం తపన పడుతూ ఉండే ముద్రగడ పద్మనాభం.. పవన్ సామర్థ్యం మీద నెగటివ్ కామెంట్లు చేయడం చిత్రమైన పరిణామమే. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం వంటి కీలక అంశంపై పోరాటం సాగించడానికి పవన్ కున్న రాజకీయ అనుభవం - పరిణతి ఇవేవీ కూడా సరిపోయేవి కావని ముద్రగడపద్మనాభం అంటున్నారు.

నిజానికి ప్రత్యేకహోదా గురించి పోరాడడానికి తన సత్తా చాలదని - తన గొంతు చాలదని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈవిషయంలో ముద్రగడ పద్మనాభం కొత్తగా కనుక్కొన్న సంగతి ఏముంది? పవన్ కల్యాణ్ వెటకారం చేయడానికి ముద్రగడ తన సహజవ్యంగ్య శైలిలో మాట్లాడుతున్నట్లుగా ఉన్నది తప్ప.. ఆయన తర్కబద్ధమైన విమర్శ చేస్తున్నట్లుగా లేదని ఆయన సామాజికవర్గంలోనే పలువురు పేర్కొంటున్నారు. తన బలం చాలదు గనుకనే.. తాను రాష్ట్రంలోని ఇతర మేధావులను కూడా కలుపుకుంటూ.. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయన ప్రస్తుత ప్రయత్నం సాగుతోంది. మరి ఆ మేధావుల జాబితాలో తనను కూడా గుర్తించలేదేమోనని ముద్రగడ ఆవేదన చెందుతున్నారో ఏమో తెలియదు గానీ.. పవన్ చాలడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ముద్రగడ తాజాగా కాపుల రిజర్వేషన్ అంశానికి మరో డెడ్ లైన్ పెట్టేశారు. మార్చి 31వ తేదీలోగా కాపు రిజర్వేషన్ అమల్లోకి రావాల్సిందేనట. లేకపోతే.. మళ్లీ పోరాటం షురూ చేస్తానని ఆయన అంటున్నారు. ఒకవైపు చంద్రబాబునాయుడు కాపు రిజర్వేషన్ వ్యవహారాన్ని చట్ట సవరణ సహా సాధించడానికి కేంద్రానికి నివేదించి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆ వ్యవహారం సభ ముందుకు వస్తుందనే గ్యారంటీ ఎంతమాత్రమూ లేదు.. అలాంటి నేపథ్యంలో మార్చి 31 డెడ్ లైన్ నిర్ణయించి ముద్రగడ ఏం సాధించదలచుకున్నారో అర్థం కావడం లేదు.