Begin typing your search above and press return to search.

ఎస్పీలో కుంప‌టికి కోడ‌లే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   31 Dec 2016 6:36 AM GMT
ఎస్పీలో కుంప‌టికి కోడ‌లే కార‌ణ‌మా?
X
కుటుంబ రాజ‌కీయాల్లో ప్ర‌తి అంశం ముఖ్య‌మే. ఇంకా చెప్పాలంటే మ‌హిళ‌ల విష‌యంలో ఎంత‌టి వారైనా అతి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాల్సిందే. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో అధికార స‌మాజ్ వాదీ పార్టీలో జ‌రుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్ ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే మిగ‌తా కార‌ణాల కంటే ఇందులో మ‌హిళ కోణం ఎక్కువ‌గా ఉంద‌ని స‌మాచారం. తండ్రి ములాయంకు పోటీగా 235 మంది అభ్యర్థులతో ప్రత్యామ్నాయ జాబితా ప్రకటించిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన తమ్ముడు ప్రతీక్ భార్య అపర్ణాయాదవ్‌ కు చోటు కల్పించలేదు. ప్రతీక్ ములాయం రెండో భార్య సాధనాగుప్తా కొడుకు. అపర్ణ కూడా అఖిలేశ్‌ను వ్యతిరేకిస్తున్న శివ్‌ పాల్ గ్రూప్‌ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అఖిలేశ్‌ కు ప్రత్యామ్నాయంగా పార్టీలో యువ నేతగా ముందుకు వచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఎస్పీ గెలిస్తే సీఎం అభ్యర్థిత్వానికి అపర్ణాయాదవ్ ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది.

మ‌రోవైపు తన తండ్రి - సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంపై తిరుగుబాటు చేసిన సీఎం అఖిలేశ్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చేయడంతో ఉత్తరప్రదేశ్‌ లోని అధికార పార్టీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సీఎం అఖిలేశ్‌ తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్‌ లను ఆరేళ్ల‌పాటు బహిష్కరించినట్లు ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ ప్రకటించారు. తదుపరి సీఎం ఎవరో త్వరలో నిర్ణయిస్తానన్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగ‌తి తెలిసిందే. తన మాట పెడచెవిన పెడుతూ అఖిలేశ్ రాజకీయ భవిష్యత్‌ ను రాంగోపాల్ నాశనం చేస్తున్నాడని ములాయం ఆరోపించారు. పార్టీకి భారీ ముప్పుగా పరిణమించిన రాంగోపాల్‌ పై బహిష్కరణకు మించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా జ‌న‌వ‌రి ఒక‌టిన పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి హోదాలో రాంగోపాల్ యాదవ్ చేసిన ప్రకటన ఎస్పీ అధినేతకు ఆగ్రహం తెప్పించింది. పార్టీ అధినేతగా తాను మినహా మరెవ్వరూ సమావేశాలు నిర్వహించినా పార్టీ నియమావళికి వ్యతిరేకమేనన్నారు. తాను చాలా కష్టపడి పార్టీని నిర్మించానని, రాంగోపాల్ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడువద్దని ఎస్పీ అధినేత స్పష్టం చేశారు. అఖిలేశ్ - రాంగోపాల్ నుంచి పార్టీని కాపాడుకుంటామని ములాయం ప్రకటించారు. ఒకవేళ అఖిలేశ్ క్షమాపణ చెప్తే బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. అంతకుముందు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అఖిలేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌లకు ములాయం షోకాజ్ నోటీసు జారీచేశారు. తాను ప్రకటించిన జాబితాకు పోటీగా అఖిలేశ్ మరో జాబితా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ములాయం అనూహ్యంగా తనకు షోకాజ్ నోటీసు జారీచేయడంతో రాంగోపాల్ యాదవ్ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆదివారం అత్యవసర పార్టీ సమావేశం జరుపుతున్నట్లు ప్రకటించారు. దీనితో సీఎం అఖిలేశ్ గ్రూపు రాజీకి సిద్ధంగా లేమని సంకేతాలిచ్చింది.

2017 ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారు విషయమై తనను సంప్రదించకుండా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్‌ తో కలిసి ఎస్పీ అధినేత ములాయం.. 393 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించడం సీఎం అఖిలేశ్‌ ను మనస్తాపానికి గురిచేసింది. దీంతో ఆయన 235 మందితో ప్రత్యామ్నాయ జాబితాను సోషల్ మీడియాకు లీక్‌ చేశారు. ఈ నేపథ్యంలో ములాయం శనివారం పార్టీ సమావేశాన్ని చేశారు. టిక్కెట్లు కేటాయించిన వారంతా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/