Begin typing your search above and press return to search.

నామా టీడీపీకి రాజీనామా చేశారంటే..?

By:  Tupaki Desk   |   19 March 2019 9:37 AM GMT
నామా టీడీపీకి రాజీనామా చేశారంటే..?
X
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోసం కిందా మీదా ప‌డుతున్న తెలుగుదేశం పార్టీకి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుల‌లో ఒక‌డిగా చెప్పే నామా నాగేశ్వ‌ర‌రావు గుడ్ బై చెప్పారు. తాజాగా ఆయ‌న త‌న పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా ఆయ‌న పార్టీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ లోకి చేర‌తార‌న్న మాట బ‌లంగా వినిపించింది.

వాస్త‌వానికి కొద్ది రోజుల నుంచి ఆయ‌న టీఆర్ ఎస్ లోకి చేరేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఖ‌మ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయ‌న టీఆర్ ఎస్ అభ్య‌ర్థి పువ్వాడ అజ‌య్ కుమార్ మీద ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో నామా గెలుస్తార‌న్న ప్ర‌చారం భారీగా జ‌రిగింది. అయితే.. అందుకు భిన్న‌మైన ఫ‌లితం వ‌చ్చింది.

వాస్త‌వానికి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామాకు పోటీ చేయ‌టం ఇష్టం లేద‌ని చెబుతారు. అయితే.. బాబు ఒత్తిడితోనే ఆయ‌న బ‌రిలోకి దిగార‌ని.. త‌న ఓట‌మి ద్వారా బాబు త‌న ప‌రువు తీసిన‌ట్లుగా ఆయ‌న చెప్పిన‌ట్లుగా ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. గ‌డిచిన కొద్ది రోజులుగా పార్టీ నుంచి మారి టీఆర్ఎస్ చేర‌టానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. అయితే.. కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవటంతో ఆగిన‌ట్లు చెబుతారు.

తాజాగా కేసీఆర్ ఓకే చెప్ప‌టంతో టీడీపీకి రాజీనామా చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఆయ‌న టీఆర్ ఎస్ ఖ‌మ్మం ఎంపీ సీటును కోరిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. నామా కోరిక‌ను కేసీఆర్ తీరుస్తారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. మ‌రోవైపు ఆయ‌న కాంగ్రెస్ లో చేరాల‌ని భావిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నా.. అందులో నిజం లేద‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు త‌ప్పించి మ‌రే పార్టీకి ప్ర‌జల మ‌ద్ద‌తు లేద‌న్న భావ‌న ఉన్న నేప‌థ్యంలో నామా గులాబీ కారు ఎక్క‌టం ఖాయ‌మంటున్నారు.