Begin typing your search above and press return to search.

లోకేష్.. వద్దంటే వెళ్లాడా మంగళగిరికి..

By:  Tupaki Desk   |   26 May 2019 5:37 AM GMT
లోకేష్.. వద్దంటే వెళ్లాడా మంగళగిరికి..
X
నిండా మునిగాక చలి ఏంటన్నది సామెత. ఇప్పుడీ సామెత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముద్దుల కుమారుడు లోకేష్ కు అక్షరాల సరిపోతుంది. లోకేష్ ను రాజకీయ అరంగేట్రం చేయడానికి నెలల తరబడి పరిశోధన చేసిన చంద్రబాబు.. తెలిసి తెలిసి.. ఓడిపోయే చోట బరిలోకి దింపడం ఏంటన్న ప్రశ్న ఎన్నికల ముందరే వ్యక్తమైంది. కుప్పం నుంచి విశాఖ వరకు టీడీపీ గెలిచే సీట్లు ఎన్నో ఉన్నా.. బలమైన ప్రత్యర్థి ఉన్న మంగళగిరిలో లోకేష్ ను బాబు ను దించి టీడీపీ ఇప్పుడు చేతులు కాల్చుకుంది.

లోకేష్ రాజకీయాల్లోకి రాంగ్ డైరెక్షన్ లో అడుగుపెట్టారు. మంగళగిరిని ఎంచుకొని పెద్ద తప్పుచేశారన్న చర్చ ఇప్పుడు టీడీపీలో వ్యక్తమవుతోంది. లోకేష్ మీద ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న ‘వద్దంటే వెళ్లాను మంగళగిరికి’ పాట సెటైరికల్ గా ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నా అందులో వాస్తవం ఉంది.

లోకేష్ కు టీడీపీ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తర్వాత అన్నీ తానై చూసుకుంటున్న నేత. బాబు తర్వాత ఈయనే టీడీపీ అధ్యక్షుడు. అలాంటి లోకేష్ ఓటమికి ప్రధాన కారణం నియోజకవర్గాన్ని సరిగ్గా ఎంపిక చేసుకోకపోవడమేనన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

మంగళగిరి నియోజకవర్గంలో తొలి నుంచి బీసీలే గెలుస్తూ వస్తున్నారు.మంగళగిరిలో పద్మాశాలీ సామాజికవర్గం ఎక్కువ. ప్రతిసారి ఇక్కడ పార్టీలు పద్మశాలీలనే బరిలో దించుతూ ఉంటాయి. 2014లో మాత్రం వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో దించింది. టీడీపీ అభ్యర్థిగా గంజి శ్రీనివాస్ అనే పద్మాశాలీనే బరిలో దించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచారు.

కానీ 2019లోకి వచ్చేసరికి చంద్రబాబు తన కొడుకు లోకేష్ విషయంలో వెనక్కి తగ్గడానికి ముందుకు వచ్చాడట.. కుప్పంలో లోకేష్ - తిరుపతిలో చంద్రబాబు పోటీచేయాలని భావించారు. ఇక పలమనేరు - విజయవాడ తూర్పు వంటి టీడీపీ కంచుకోటలను కూడా లోకేష్ కోసం చూశారు. విశాఖ ఉత్తరం, - భీమిలిలను ఆలోచించారు.కానీ బలమైన అభ్యర్థి ఉన్న మంగళగిరిని టీడీపీ ఎంపిక చేసి లోకేష్ ను సాహసానికి పోయింది.. అయితే డబ్బు, అధికారం ఉండడంతో మంగళగిరిలో ఈజీగా గెలుస్తానని లోకేష్ భావించాడు. ప్రచారంలోనూ అదే వేవ్ కనిపించింది.

దశాబ్ధాలుగా మంగళగిరిలో టీడీపీ గెలిచింది లేదు. పైగా పద్మాశాలీల కంచుకోట.. కానీ అమరావతి పరిధిలో ఉండడంతో అభివృద్ధి చేశామని ప్లస్ అవుతుందని లోకేష్ భావించి ఉంటాడని తెలుస్తోంది. కానీ రాష్ట్రమంతా జగన్ సునామీ.. ప్రత్యర్థి బలమైన వాడు కావడంతో లోకేష్ కు ఓటమి తప్పలేదు.