Begin typing your search above and press return to search.

మోదీని డామినేట్ చేస్తుందనే మంత్రి పదవి ఇవ్వలేదా..?

By:  Tupaki Desk   |   31 May 2019 12:28 PM GMT
మోదీని డామినేట్ చేస్తుందనే మంత్రి పదవి ఇవ్వలేదా..?
X
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన, తన జట్టులో 57 మందికి స్థానం కల్పించారు. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ - సోనియాగాంధీ - రాహుల్‌ గాంధీ - గులాం నబీ ఆజాద్‌ - అనేక బీజేపీ-పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు - కర్ణాటక - ఢిల్లీ సీఎంలు హాజరయ్యారు. వీరితో పాటు అనేక మంది కార్పొరేట్‌ దిగ్గజాలు - సినీ - సామాజిక రంగ ప్రముఖులు వచ్చారు. అలాగే బిమ్స్‌ టెక్‌ దేశాలు- బంగ్లాదేశ్‌ - శ్రీలంక - మయన్మార్‌ - నేపాల్‌ - భూటాన్‌ - మాల్దీవుల అధినేతలు - కిర్గిజ్‌ స్థాన్‌ అధ్యక్షుడు దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. మోదీ తన కేబినెట్ నుంచి ఒకరిని తప్పించడం చర్చనీయాంశం అవుతోంది. వారు మరెవరో కాదు.. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పని చేసిన సుష్మా స్వరాజ్. గత ప్రభుత్వంలో ఆమె విదేశాంగ మంత్రిగా తన బాధ్యతలను వందకు వంద శాతం సక్రమంగా నిర్వర్తించారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ధైర్యంగా పని చేశారు. అంతేకాదు - ఎంతో నిజాయితీ - నిబద్ధతతో నిలబడ్డారు. దీంతో ఈ కేబినెట్‌ లోనూ ఆమెకు స్థానం ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా సుష్మా స్వరాజ్‌ కు చోటు దక్కలేదు. అనారోగ్య కారణాలతోనే ఆమె మంత్రి పదవిని వద్దనుకున్నారని భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు - ఆమెను కేబినెట్‌ లోకి తీసుకోకపోవడంతో మోదీపై విమర్శల వర్షం కురుస్తోంది.

వాస్తవానికి 2019 లోక్‌ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని సుష్మా స్వరాజ్‌ ముందుగానే ప్రకటించారు. దీంతో ఆమెకు రాజ్యసభ కేటాయించి - మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌ కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రధాని మోదీపై కామెంట్లు చేస్తున్నారు. ఆయన కావాలనే ఆమెను పక్కన పెట్టేశారని తిట్టిపోస్తున్నారు. అయితే, దీని వెనుక మరో ప్రచారం కూడా జరుగుతోంది. సుష్మా స్వరాజ్ చాలా సందర్భాల్లో మోదీని డామినేట్ చేసేలా పని చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో మోదీ కంటే ఎక్కువగా ఆమెకే ప్రజాధరణ కనిపించింది. సో.. ఈ కారణంగానే సుష్మను కావాలనే కేబినెట్‌ లోకి తీసుకోలేదని అంటున్నారు. ఇది నిజమై ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.