Begin typing your search above and press return to search.

జీఎస్టీని మోడీ ఎందుకు వ్యతిరేకించారంటే..?

By:  Tupaki Desk   |   1 July 2017 7:09 AM GMT
జీఎస్టీని మోడీ ఎందుకు వ్యతిరేకించారంటే..?
X
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయాల్లో జీఎస్టీ అమలు కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తూ సమూల మార్పులకు కారణమవుతున్న ఈ బృహత్కార్యం సాధనకు మోడీ ఎంతో పట్టుదలతో వ్యవహరించి అనుకున్నది సాధించుకున్నారన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ... ఒకప్పుడు ఇదే మోడీ జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి ఎంతమందికి తెలుసు? అది కూడా ఎప్పుడో దశాబ్దాల కిందటేమీ కాదు, అఖండ విజయంతో తాను గద్దెనెక్కిన 2014కి ఆర్నెళ్ల ముందు 2013లో కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

2013లో జీఎస్టీని అమలు చేయాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం తీర్మానించింది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్‌ టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు రూ.9000 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2013 ఆగస్టులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిఎస్‌ టీ కొత్త ప్రతిపాదనలతో నివేదిక సమర్పించింది. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ జీఎస్టి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం రూ.14,000 కోట్లు నష‍్టమని విమర్శించారు.

అయితే 2013 ఆగస్ట్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జీఎస్‌ టీ పై తన నివేదికను అందించగా.. ఈ కమిటీ నివేదించిన సూచనలను బిల్లులో చేర్చారు. 2013 సెప్టెంబర్‌ లో సాధికారిక కమిటీకి సవరించిన బిల్లును పంపారు. ఈ కమిటీ అందించిన సూచనల ప్రకారం 2014మార్చ్‌ లో మరోసారి బిల్లును సవరించారు.

అయితే.. ఆశ్చర్యకరంగా ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన మోడీయే 2014లో ప్రదాని మంత్రి అయిన తరువాత జీఎస్‌ టీ అమలుపై వేగంగా చర్యలు చేపట్టారు. డిసెంబరు 18న జీఎస్టీకి 122 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జీఎస్‌ టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు 2015 మే నెలలో లోక్‌ సభ ఆమోదం లభించింది. అయితే.. అంతకుముందు దీన్ని ముందుకు తీసుకెళ్లిన కాంగ్రెస్ ఈసారి ప్రతిపక్షంలో ఉంటూ అభ్యంతరాలు చెప్పింది. జీఎస్‌ టీని 18 శాతానికి పరిమితం చేయాలని పట్టుబట్టింది కాంగ్రెస్. అలాగే 1 శాతం ఎంట్రీ ట్యాక్స్‌ ను తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది.

2016 ఆగస్ట్‌ లో ప్రధాన అడ్డంకిగా ఉన్న రాజ్యసభ కూడా జీఎస్‌ టీ బిల్లును ఆమోదించింది. సెప్టెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో జీఎస్‌ టీ కౌన్సిల్ ఏర్పాటు కాగా, సెప్టెంబర్ 22-23 తేదీల్లో కౌన్సిల్ మొదటిసారి సమావేశమైంది. ఈ సందర్బంగా ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేలా 2016 అక్టోబర్‌ 18న జీఎస్‌ టీ కౌన్సిల్ ఒక ప్రతిపాదన చేసింది. అదే ఏడాది నవంబర్ 3న 5 - 12 - 18 - 28 శాతం అంటూ నాలుగు శ్లాబుల విధానానికి జీఎస్‌ టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే సెస్‌ ను కూడా ఆమోదించారు. సెంట్రల్ జీఎస్‌ టీ - స్టేట్ జీఎస్‌ టీలపై ఏకాభిప్రాయం కుదర్చడంలో జీఎస్‌ టీ కౌన్సిల్ విఫలం అయింది. 2016 డిసెంబర్ 23న జీఎస్‌ టీ కౌన్సిల్‌ లో రెండు చట్టాలకు ఒప్పందం కుదిరినా.. ద్వంద్వ నియంత్రణ మాత్రం ప్రశ్నార్ధకంగానే నిలిచింది. 2017 జనవరి 3న కాంపెన్సేషన్ కార్పస్‌ ను 55 వేల కోట్ల రూపాయల నుంచి 90వేల కోట్లకు పెంచడంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. జనవరి 16న జరిగిన జీఎస్‌ టీ కౌన్సిల్ భేటీలో పన్ను విధించే అధికారంలో ద్వంద్వ నియంత్రణపై వచ్చిన సమస్యలకు పరిష్కారం లభించింది. 2017 ఫిబ్రవరి 18న డ్రాఫ్ట్ కాంపెన్సేషన్ బిల్లును జీఎస్‌ టీ కౌన్సిల్ తుది రూపునిచ్చింది. మార్చ్ 20న కేంద్ర కేబినెట్ అన్నిజీఎస్‌ టీ బిల్లులకు ఆమోదం పలుకగా.. మార్చ్ 27న లోక్‌ సభలో తుది బిల్లులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. 2017 మార్చ్ 29న లోక్‌ సభ జీఎస్‌ టీకి ఆమోదం పలకగా.. మే నెలలో జీఎస్‌ టీ కౌన్సిల్ పలు మార్లు చర్చలు జరిపి.. వస్తువులు-సేవలపై రేట్లను ఖరారు చేశారు. ఫైనల్‌ గా ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ అర్థరాత్రి నుంచి జీఎస్‌టీ అమలుకు నాంది పలికారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/