Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఓటేశారు.. ఆమె జ్ఞాప‌కాల‌తో!

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:30 PM GMT
ఎన్టీఆర్ ఓటేశారు.. ఆమె జ్ఞాప‌కాల‌తో!
X
ఒక్క వాక్యంలో చెప్పాలంటే... నంద‌మూరి తార‌క రామారావు ఓటేస్తున్న దృశ్యం. క‌ద‌ల‌ని ఈ చిత్రం వెన‌క గుండెను క‌దిలించే గ‌తం ఉంది! మౌనంగా ఓటేస్తున్న ఎన్టీఆర్ మ‌న‌సులో ఓ అగ్నిగోళ‌మే దాగి ఉంది. త‌న క‌ళ్ల‌లోని బాధ‌ను బ‌య‌ట‌కి క‌నిపించ‌కూడ‌ద‌నే ఉండాల‌నే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఇలాంటి న‌ల్ల క‌ళ్లజోడు పెట్టేసి ఉంటారు. 1985 మార్చి 5న రాష్ట్రంలో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఒక్క‌రే ఇలా పోలింగ్ బూతుకు వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్ రాకే ఒక సంచ‌ల‌నం. పార్టీ పెట్టిన అది కొద్దికాలంలోనే అధికారంలోకి వ‌చ్చిన చ‌రిత్ర ఆయ‌న‌ది. నేడు తెలుగుదేశం పార్టీ ఒక బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది అంటే కార‌ణం.. ఆయ‌న వేసిన పునాదులే. ఎన్టీఆర్ రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేసిన త‌రువాత 1983 జ‌న‌వ‌రి 5న ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు హైద‌రాబాద్ లోని అబిడ్స్ ప్రాంతంలో స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంతో స‌హా వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. త‌రువాత విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగుదేశం ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి పీఠం అధిష్టించారు.

ఆ త‌రువాతి సంవ‌త్స‌ర‌మే ఎన్టీఆర్ ఆరోగ్యం దెబ్బ‌తింది. అమెరికా వెళ్లి గుండెకి చికిత్స చేయించుకున్నారు. అనూహ్యంగా అక్క‌డే బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే... ఆమెకి క్యాన్స‌ర్ ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ బాధ‌తో రాష్ట్రానికి తిరిగి రాగానే ఇక్క‌డ నాదెండ్ల రూపంలో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. దీంతో ఎన్టీఆర్ కు మ‌న‌శ్శాంతి లేకుండాపోయింది. ఎన్టీఆర్ స‌తీమ‌ణికి క్యాన్స‌ర్ ముదిరిపోయింది. వైద్యుల‌ను సంప్ర‌దిస్తే వారూ చేతులు ఎత్తేశారు. ఒక‌ప‌క్క రాజ‌కీయ సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికీ... అంప‌శ‌య్య‌పై ఉన్న ధ‌ర్మ‌ప‌త్నికీ స‌రైన స‌మ‌యం కేటాయించ‌క లేక ఎన్టీఆర్ ఎంతో స‌త‌మ‌త‌మైపోయారు.

క్యాన్స‌ర్ బ‌య‌ట‌ప‌డిన మూడు నెల‌ల‌కే ఆమె తుదిశ్వాస విడిచి.. ఎన్టీఆర్ ను ఏకాకి చేసి వెళ్లిపోయారు. 1984, అక్టోబ‌ర్ 1న ఆమె మ‌ద్రాసులో ప్రాణాలు విడిచారు. ఆ త‌రువాత‌, రాజ‌కీయ సంక్షోభాన్ని త‌ట్టుకోవ‌డం కోసం శాస‌న స‌భ‌ను ర‌ద్దు చేశారు. తెలుగు ప్ర‌జ‌ల‌పై అపార న‌మ్మ‌కంతో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 1985 మార్చి 5న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఓటు వేయ‌డానికి ఎన్టీఆర్ ఒక్క‌రే వ‌చ్చారు. కొన్ని నెల‌ల కింద‌టే భార్య చ‌నిపోవడం - రాజ‌కీయ సంక్షోభం రావ‌డం.. ఇలాంటి మాన‌సిక ప‌రిస్థితుల మ‌ధ్య అబిడ్స్ లో ఎన్టీఆర్ ఒక్క‌రే వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం 202 సీట్లు సాధించి విజ‌య‌ఢంకా మోగించింది.

సో.. అదే ఈ చిత్రం. ఆ క‌ళ్ల జోడు వెన‌క ఎంత మ‌నోవేద‌న దాగి ఉంటుందో క‌దా. ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఎన్టీఆర్ చుట్టూ ఎంత ఒంట‌రిత‌నం అల‌ముకుని ఉందో క‌దా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/