Begin typing your search above and press return to search.

ప్ర‌తిపక్ష నేత‌ల జంపింగ్‌ ల మ‌ర్మ‌మిదేనా?

By:  Tupaki Desk   |   16 April 2016 5:30 PM GMT
ప్ర‌తిపక్ష నేత‌ల జంపింగ్‌ ల మ‌ర్మ‌మిదేనా?
X
తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేతలు అధికార పార్టీ కండువా క‌ప్పుకొనేందుకు ఆతృత ప‌డుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప‌రిణామాల సంగ‌తి అటుంచితే తెలంగాణ‌లో జంపింగ్‌ లు భ‌లే ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌ల పార్టీ పిరాయింపులు ఆస‌క్తినే విచిత్రంగా కూడా ఉన్నాయి. దీనికి కార‌ణం కాంగ్రెస్ నేత‌ల ప‌ద‌వుల‌ ఆరాటమ‌ని స‌మాచారం.

కాంగ్రెస్‌ నుంచి ఇంకొందరు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. పదేళ్ల‌పాటు మంత్రిపదవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీలోని సీనియర్‌ ఎమ్మెల్యేలకు ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకుంటానని మాట ఇస్తే టీఆర్‌ ఎస్‌ లో చేరేందుకు కొంతమంది సీనియర్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయవ‌ర్గాల సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో పాటు టీడీపీ - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌ లో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కాకపోయినా తుమ్మల నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కు సైతం మంత్రి పదవి అప్పగించారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లకు ఇచ్చినట్టుగానే తమకూ హామీ ఇస్తే గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు కాంగ్రెస్‌ లోని పలువురు సీనియర్‌ నేతలు అధికారపార్టీకి పంపినట్టు తెలిసింది.

నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరూ ఎప్పట్నుంచో టీఆర్‌ ఎస్‌ నేతలతో టచ్‌ లో ఉన్నారు. ఆ విషయాన్ని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యక్రమాలను కొనియాడుతూ ప్రకటనలు కూడా చేశారు. ఇక టీఆర్‌ ఎస్‌ లో చేరడమే ఆలస్యమని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిపై ఆశ వదులుకున్నట్టు మీడియా అంతర్గత చర్చల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్‌ లోని ఉంటామని ఆ ఇద్దరు చెబుతున్నా వారి మాటల మీద విశ్వాసం పోయిందన్న భావన ఆ పార్టీలోనే వ్యక్తమవుతున్నది. గులాబీ కండువా కప్పుకోవడానికి ముందు ఒకరికి కాంట్రాక్టు పనులు - మరొకరికి మంత్రిపదవి ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు షరతు పెట్టినట్టు తెలిసింది. దానికి ముఖ్యమంత్రి ససేమిరా అన్నారని, మంత్రి జగదీశ్‌ రెడ్డి వ్యతిరేకించారని గతంలో వార్తలు వచ్చాయి. జానారెడ్డికి హోంశాఖ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని ఆయన మీడియా సాక్షిగా ఖండించారు. ప్రభుత్వ చర్యలను ప్రజల్లోకి తీసుకెళతామని చెబుతున్నారు తప్ప అసెంబ్లీలో ఆయన ప్రస్తావించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా చేరికలపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు.

మెదక్‌ జిల్లాలోని సీనియర్‌ మంత్రిగా కొనసాగిన మహిళా ఎమ్మెల్యే కారెక్కడమే తరువాయి అని ప్రచారం జరిగినా, ఆమె కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆ జిల్లా నుండి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ - మంత్రిగా హరీశ్‌ రావు - డిప్యూటీ స్పీకర్‌ గా పద్మా దేవేందర్‌ రెడ్డి ఉన్నారు. మరొకరికి ఇచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. మాజీ మంత్రి డీకే అరుణ కూడా మంత్రి పదవిని ఆశించారని, కానీ ఆమెకు మహిళా కార్పొరేషన్‌ పదవి ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరిచారని తెలిసింది. ఖమ్మంలోని ఒక ఎమ్మెల్యే జంపింగ్‌ కు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగా, మరో ఎమ్మెల్యేతో ఒక సీనియర్‌ మంత్రి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కొంతమంది మాజీలు ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కారెక్కడానికి సిద్ధమై, చివర్లో విరమించుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవిపై స్పష్టత రాకపోవడంతో ఆయన వెనుదిరిగినట్టు సమాచారం. పొన్నాల లక్ష్మయ్యపైనా ప్రచారం జరిగినా, ఆ వార్తలను ఆయన ఖండించారు.

అయితే అధికార‌ప‌క్షంవైపు నుంచి గ్రీన్‌ సిగ్నల్స్ వచ్చిన వెంటనే ఇలాంటి ఖండనలు గాలిలో కలిసిపోతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ - అరికెపూడి గాంధీ - వివేకానంద - చిట్టెం రామ్మోహనరెడ్డిలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. సీనియర్ల కంటే ముందుగా జూనియర్లను చేర్చుకునేందుకు టీఆర్‌ ఎస్‌ పార్టీ మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఆ తర్వాతే తిరిగి సీనియర్లే తమ గూటికి చేరతారని ధీమాతో ఉన్నారు. 2019లో తిరిగి తమ ప్రభుత్వమే తిరిగి వస్తుందని, వారంతా తమ పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మంత్రుల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు.