Begin typing your search above and press return to search.

జగన్ పై పరిటాల సునీత కోపం ఎందుకంటే?

By:  Tupaki Desk   |   23 Nov 2017 10:48 AM IST
జగన్ పై పరిటాల సునీత కోపం ఎందుకంటే?
X
అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత ది తన పనేదో తాను చేసుకునిపోయే తత్వం - పనిగట్టుకుని ఆమె ఎవరినీ విమర్శించిన దాఖలాలు ఉండవు. తనను ఎవరైనా ఏమైనా అంటేనే ఆమె వారిపై విమర్శలు గుప్పిస్తారు. కానీ.. తాజాగా ఆమె జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నందుకు విపక్ష నేతపై విమర్శలు చేయడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. ఇప్పుడ సడెన్ గా పెద్దగా సందర్భమేమీ లేకుండా ఆమె ఇలా జగన్ పై విమర్శలు చేయడమే ఆసక్తికరంగా మారింది. అనంతలోని రాజకీయ పరిస్థితులే ఆమెతో విమర్శలు చేయించాయని అంటున్నారు.

త‌మ ప్ర‌భుత్వం చేస్తోన్న అన్ని ప‌నుల‌ను జ‌గ‌న్ విమ‌ర్శిస్తున్నార‌ని... పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నార‌ంటూ జగన్ పై ఆమె మండిపడిన సంగతి తెలిసిందే. సీఎం సీటుపై మోజుతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇష్టం వ‌చ్చిన‌ట్లు హామీలు ఇస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. కోర్టులు - జైళ్ల చుట్టూ తిరగడం తప్ప ఆయన ముఖ్య‌మంత్రి కాలేర‌ని ఎద్దేవా చేశారు. అయితే... అనంత టీడీపీ నేతలకు చంద్రబాబు వరుసగా పదవులు ఇచ్చుకుంటూ మంత్రిపై ఒత్తిడి పెంచుతున్నారని.. ఆ కారణంగానే ఆమె విపక్ష నేతపై విమర్శలకు దిగి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

అనంతలో పల్లె రఘునాథరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత పరిటాల సునీతయే అక్కడ పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ.. తాజాగా మళ్లీ పల్లెకు పదవి ఇవ్వడమే కాకుండా పయ్యావుల కేశవ్ కు కూడా మంచి పదవినే కట్టబెట్టారు చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో తన హవాకు చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలైనట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సునీత మరింత యాక్టివేట్ అవుతున్నారని అంటున్నారు.