Begin typing your search above and press return to search.

మాల్దీవుల‌కు ప‌ట్టాభి.. అస‌లు రీజ‌న్ ఇదేనా?

By:  Tupaki Desk   |   26 Oct 2021 7:39 AM GMT
మాల్దీవుల‌కు ప‌ట్టాభి.. అస‌లు రీజ‌న్ ఇదేనా?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి ఫ్యామిలీ.. మాల్దీవుల‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలు.. ఎవ‌రు విడుద‌ల చేశార‌నేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీని పై టీడీపీ నేత‌లు ఎవ‌రూ కూడా స్పందించ‌డం లేదు. కానీ.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు.. ముఖ్యంగా ప‌ట్టాభి భార్య‌.. చంద‌న కోరిక మేర‌కు.. కొంత రిలీఫ్ కోసం.. మాల్దీవుల‌కు వెళ్లార‌ని .. కొన్ని వ‌ర్గాల మీడియా ప్ర‌చారం చేస్తోంది. అధికార పార్టీ నేత‌ల‌పై ప‌ట్టాభి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పట్టాభి ఇంటి పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు.

అనంత‌రం.. పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. రిమాండ్‌.. త‌ర్వాత‌.. హైకోర్టు బెయిల్ ఇవ్వ‌డం వంటివి జ‌రిగిపోయాయి. ఈ క్ర‌మంలో ఒకింత‌ ప్రశాంతత కోసం కొన్నిరోజులు విహారయాత్రకు తీసుకెళ్లాలని భార్య చందన ఆయనను కోరినట్టు చెబుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు ఓ వ‌ర్గం మీడియా చెబుతోంది. అదేస‌మయంలో ఈ ప‌ర్య‌ట‌న‌ను స‌మ‌ర్ధించుకుంటూ.. పట్టాభికి బెయిల్‌ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించనందున ఆయనకు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చెప్పిన‌ట్టు తెలిపారు.

అయితే.. ఇది ఒక్క‌టేనా.. కార‌ణం.. రిలీఫ్ కోస‌మే.. ప‌ట్టాభి వెళ్లారా? అంటే.. దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నాయ‌కులు చాలా మంది అరెస్ట‌యి.. జైలు జీవితం గ‌డిపి వ‌చ్చారు. ప‌ట్టాభి మహా అయితే.. రెండు రోజులు జైల్లో ఉన్న‌ట్టున్నారు. కానీ.. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. అచ్చెన్నాయుడు.. మాజీ ఎమ్మెల్యే సంగం డెయిరీ చైర్మ‌న్‌.. ధూళిపాళ్ల న‌రేంద్ కుమార్ చౌద‌రి, మాజీ మంత్రి.. కొల్లు ర‌వీంద్ర వంటివారు వారం రోజుల పాటు జైలు జీవితం అనుభ‌వించి.. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. మ‌రి వారికి లేని రిలీఫ్ ప‌ట్టాభికే ఎందుకు అవ‌స‌ర‌మైంది? అనేది ప్ర‌శ్న‌.

దీనికి సంబంధించి విశ్లేష‌కులు చెబుతున్న మ్యాట‌ర్ ఏంటంటే.. ప‌ట్టాభిచేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ర‌గ‌డ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వైసీపీ నాయ‌కులు ఈ వ్యాఖ్య‌ల‌ను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో దాడులు ఇంకా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. పైగా.. ప్ర‌భుత్వం ఇంకా ఏవైనా.. కేసులు పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని సీనియ‌ర్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సుమారు 15 రోజుల‌కు త‌గ్గ‌కుండా.. ప‌ట్టాభిని దూరం పంపించాల‌ని.. ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను మాల్దీవుల‌కు పంపించి ఉంటార‌ని అంటున్నారు.

అంతేకాదు.. మ‌రి.. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లార‌నే విష‌యాన్ని ఎందుకు వివ‌రించాల్సింది వ‌చ్చింది. గోప్యంగా ఉంచొచ్చుక‌దా? అంటే.. గోప్యంగా ఉంచితే.. పారిపోయాడు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడంటూ.. మ‌రిన్ని కేసులు న‌మోదుచేసే అవ‌కాశం .,.. విమ‌ర్శ‌లు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. ఏదేమైనా.. రిలీఫ్ వెనుక‌.. రియ‌ల్ ఇదేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.