Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అమ‌రావ‌తి టూర్‌ వెనుక హోదా పోరే ఒక్క‌టే కాద‌ట‌

By:  Tupaki Desk   |   30 March 2018 6:39 AM GMT
ప‌వ‌న్ అమ‌రావ‌తి టూర్‌ వెనుక హోదా పోరే ఒక్క‌టే కాద‌ట‌
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ టూర్ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారుతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం చేస్తానని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4 - 5 తేదీల్లో విజయవాడ రానున్నారు. ఈ రెండు రోజుల పాటు వామపక్ష పార్టీల నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్న పవన్ కళ్యాణ్ ముఖ్యనేతలతో భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేయనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌త్యేక హోదాతో పాటు అమ‌రావ‌తి నిర్మాణం - ప్ర‌భుత్వ అవినీతిపై ఉండ‌నుంద‌ని స‌మాచారం.

తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ రాజీ ధోరణితో వ్యవహరిస్తోందని, ఇంత కాలం పనిచేయని వారు ఇపుడు చేస్తారనే నమ్మకం లేదని పవన్‌ కళ్యాణ్ ఇప్పటికే మండిపడ్డారు. టీడీపీ రాజీ వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగిందని, ఈ విషయంలో ఆ పార్టీ పోరాటం నామమాత్రంగానే ఉందని పవన్ ఫీలవుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం తీరుపై కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఒక సమ్మిళిత రాజధాని నగరంలా రూపుదిద్దుకోవడం లేదని, అమరావతిని తెలుగు పార్టీకి అనుబంధ నగరంలా తయారుచేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుండో రాయలసీమ నుండో వచ్చి ఇమిడిపోయే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఇది సమ్మిళిత రాజధాని కాదు, కొందరికే ప్రత్యేకించిన రాజధాని - ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, తాము ఉన్నతులం అనుకుంటే కుదరదని పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా అమరావ‌తి వేదిక‌గా మ‌రోమారు ఇదే త‌ర‌హా ఘాటు కామెంట్లు చేస్తార‌ని అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హోదా ఉద్యమ తీరు - దీనిపై కేంద్రం స్పందిస్తున్న విధానంపై చర్చించడంతో పాటు వామపక్ష పార్టీలతో కలిసి జనసేన హోదా కోసం ఎటువంటి ఉద్యమం చేయాలనే దానిపై చర్చించనున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ నేతలు - కార్యకర్తలతో కూడా భేటీ అవుతున్న పవన్ కళ్యాణ్ హోదా ఉద్యమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. హోదా ఉద్యమం రగులుతున్నందున జనసేన ఆధ్వర్యంలో కూడా ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు స‌మాచారం. అందుకే ఈ భేటీ తర్వాత ఉద్యమం ఏ రూపంలో ఉండాలో ఖరారు చేసి ఆ కార్యక్రమాన్ని తొలుత అనంతపురం నుండి ప్రారంభిస్తారు. ఆ తర్వాత విశాఖ - ఒంగోలులో నిర్వహించి - అనంతరం రాష్ట్రమంతా విస్తరింప చేస్తారని తెలుస్తోంది.