Begin typing your search above and press return to search.

మాయవతి ఎంట్రీ వెనుక కారణమిదేనా?

By:  Tupaki Desk   |   3 April 2019 11:14 AM GMT
మాయవతి ఎంట్రీ వెనుక కారణమిదేనా?
X
మొన్నటి ఏపీ ఎన్నికల ప్రకటన వేళ సడన్ గా పవన్ కళ్యాణ్ ఏపీలో మాయమై యూపీలోని లక్నోలో తేలాడు. బీఎస్పీ అధినేత్రి మాయవతితో పొత్తుపెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు.. సర్లే అని సీట్లు పంచుకొని పోటీచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 7 రోజులే ఉన్న వేళ మళ్లీ మాయవతి ఏపీలో ప్రత్యక్ష్యం.. పవన్ గెలుస్తాడంటూ కితాబు..

మాయావతి ఇప్పుడు రాక వెనుక పవన్ ప్లాన్ - ధ్యేయం ఒక్కటే.. వైసీపీకి అనాధిగా బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితుల ఓట్లను చీల్చడమేనన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది. దళితులు ఏపీలో గెలుపు ఓటములను నిర్ధేశించే స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు - ఎమ్మెల్యే చింతమనేని లాంటి వాళ్లు దళితులపై నోరుపారేసుకోవడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు. అదీ కాక క్రిస్టియన్లలో చేరిన దళితులు కూడా వైఎస్ కుటుంబం ఆచరిస్తున్న క్రైస్తవానికి మద్దతుగా అనాధిగా ఉంటున్నారు..

ఇప్పుడు వీరినంతా వైసీపీకి దూరం చేయడానికే మాయవతిని పవన్ తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు - క్రిస్టియన్లను చీల్చి జనసేనకు - బీఎస్పీ అభ్యర్థులకు మళ్లించే ఎత్తును పవన్ వేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈ ప్లాన్ జనసేనాని వేశాడా.? లేక వైసీపీ ఆరోపిస్తున్నట్టు తెరవెనుక చంద్రబాబు మంత్రాంగమో తెలియదు కానీ.. మాయవతి రాక.. జనసేనకు మద్దతు వెనుక మాత్రం దళితుల ఓట్ల మళ్లింపు కుట్ర దాగి ఉందన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు ఎవరిని నమ్మి ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. కులకుంపట్ల రాజకీయాలు ఏపీలో రాజుకున్నాయనడానికి మాయావతి ఎంట్రీయే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు.