Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నిర్ణ‌యం వెనుక విమ‌ర్శ‌లే కార‌ణమా?

By:  Tupaki Desk   |   1 Nov 2016 6:29 PM GMT
ప‌వ‌న్ నిర్ణ‌యం వెనుక విమ‌ర్శ‌లే కార‌ణమా?
X
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రాజకీయ భవితవ్యంపై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. త‌నను కలసిన జనసేన నేతలు - అభిమానులతో పవన్ ముచ్చటించి ఏలూరులో తనకు అనువైన నివాసం చూడాలని, త్వరలో తన ఓటును కూడా అక్కడే నమోదు చేయించుకుంటానని వారికి వెల్లడించ‌డం వెనుక రెండు కార‌ణాలు ఉన్నాయంటున్నారు. రాజ‌కీయ విమ‌ర్శ‌కుల‌కు ధీటైన‌ స‌మాధానం ఇవ్వ‌డం - అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌జానికానికి జ‌వాబు మ‌రింత‌గా చేరువ కావ‌డం ఈ మార్పు వెనుక కార‌ణమ‌ని విశ్లేషిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధిన‌త ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ క్ర‌మంలో తన అడుగులు మరీ వేగంగా కాకుండా నెమ్మదిగానయినా నిర్దిష్టంగా - పటిష్ఠంగా ఉండాలన్న వ్యూహంతోనే ఆయన ముందుకెళుతున్నారని చెబుతున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల కార్యకలాపాలు - ప్రభుత్వ నిర్ణయాలు - ప్రతిపక్షాల ఆందోళనలను నిశితంగా గమనిస్తోన్న పవన్ త‌న‌ను క‌లిసిన అభిమానుల‌తోనూ ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతలు కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. బీజేపీ-టీడీపీల‌ను గ‌తంలో గెలిపించిన ప‌వ‌న్ ఇపుడు ప్ర‌త్యేక హోదా ద‌క్క‌న‌ప్ప‌టికీ స్పందించ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. ఒక‌వేళ మాట్లాడినా...హైదరాబాద్‌ లో కూర్చుని - సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. వీటిని పవన్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈసందర్భంగానే ప్ర‌స్తుతం ఓటుహక్కు హైదరాబాద్‌ లో ఉన్న విష‌యాన్ని పేర్కొంటూ ఏలూరుకు మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలాఉండగా, ఏలూరుకు మకాం మార్చిన తర్వాత బెజవాడలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకునేందుకు పవన్ నిర్ణయించినట్లు సమాచారం. తాను హైదరాబాద్‌ లో ఉండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం సరైన విధానం - వ్యూహం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పవన్ ఇకపై ఆంధ్రప్రదేశ్‌ కు పూర్తిస్థాయిలో మకాం మార్చనున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు ఏడాది ముందువరకూ చేతిలో ఉన్న అన్ని సినిమా ప్రాజెక్టులను పూర్తిచేసుకుని ఏడాదికి ముందు పూర్తిస్థాయి రాజకీయ నేతగా జనం ముందుకు రావాలన్నది పవన్ అసలు వ్యూహమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆలోగా ప్రాంతాల వారీగా సభలు నిర్వహించడం ద్వారా పార్టీ ఉనికిని చాటాలన్నది ఆయన ఆలోచనగా ఉందంటున్నారు. తనవద్దకు వచ్చే జనసేన నేతలు - అభిమానులను తొందరపడవద్దని - రెండేళ్లలో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచిస్తున్నారు. ఏపి ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయాన్ని గ్రహించినందుకే ఆయన తన అనుచరులకు ఈవిషయం తరచూ స్పష్టం చేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/