Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నోట పొగ‌డ్త‌ల వ‌ర్షం!..ఎన్నిక‌ల కోస‌మేనా?

By:  Tupaki Desk   |   14 April 2018 9:30 AM GMT
ప‌వ‌న్ నోట పొగ‌డ్త‌ల వ‌ర్షం!..ఎన్నిక‌ల కోస‌మేనా?
X
టాలీవుడ్ లో అశేష అభిమానుల‌ను సంపాదించుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇప్పుడు నిజంగానే పొలిటీషియ‌న్‌ గా మారిపోయారు. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని - రాజ‌కీయాల్లోని కుళ్లును క‌డిగివేసేందుకే తాను పాలిటిక్స్ బాట ప‌ట్టాన‌ని - రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలకు నాందీ ప‌లుకుతానంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌ను ప్ర‌కటించిన సంద‌ర్భంగా భారీ ప్ర‌క‌ట‌న‌లే ఇచ్చారు. అయితే ఆ మాట‌ల‌న్నీ క‌ట్టి అట‌క‌పై పెట్టేసిన ప‌వ‌న్‌... 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. కాళ్ల‌కు బ‌ల‌పం క‌ట్టుకున్న వాడి మాదిరిగా తిరిగి చంద్ర‌బాబుకు అధికార పీఠం ద‌క్కేలా చేయ‌డంలో కీల‌క భూమిక పోషించారు. ఇది జ‌రిగి ఇప్ప‌టికే నాలుగేళ్లు దాటిపోతోంది. మ‌రో ఏడాదిలో 2019 ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తాను ఏ ఒక్క పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌బోన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... జ‌న‌సేన ఒంట‌రిగానే పోటి చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

పార్ట్ టైం పొలిటీషియ‌న్‌ గా ముద్ర వేయించుకున్న ప‌వ‌న్‌... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఆ ముద్ర‌ను చెరిపేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రానున్న ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు హఠాత్తుగా త‌న పంథాను పూర్తిగా మార్చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా నిన్న రాత్రి హైద‌రాబాదులో జ‌రిగిన రాంచ‌ర‌ణ్ తేజ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం విజ‌యోత్స‌వ వేడుక‌లో ప‌వ‌న్ ప్ర‌సంగమే నిలుస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఆ వేడుక‌లో ప‌వ‌న్ ఏం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... రంగ‌స్థ‌లంలో త‌న‌దైన శైలిలో న‌టన‌ను పండించిన చెర్రీని ప్రశంస‌ల‌తో ముంచెత్తిన ప‌వ‌న్‌... చెర్రీని త‌న చిన్న త‌మ్ముడిగా అభివర్ణించారు. అంతేకాకుండా మెగా స్టార్ చిరంజీవిని త‌న తండ్రిగా, వ‌దిన‌ను త‌ల్లిగా అభివ‌ర్ణించేశారు. ప్ర‌జా రాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్‌ లో క‌లిపిన నాటి నుంచి మెగా స్టార్‌ తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వ‌స్తున్న ప‌వ‌న్‌.. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా చిరు ద‌గ్గ‌ర‌య్యేందుకే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

సోద‌రుడు చిరుతో పాటు త‌న సామాజిక వ‌ర్గం కాపుల‌ను దూరంగా పెట్టేసిన ప‌వ‌న్‌.. తనను తాను కుల రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే వ్య‌క్తిగా చెప్పుకునే య‌త్నం చేశారు. అయితే అది అంత ఈజీ ఏమీ కాద‌న్న విష‌యం ప‌వ‌న్‌కు ఇప్పుడు బోధ‌ప‌డిన‌ట్లుంది. ఎందుకంటే... సొంత సామాజిక వ‌ర్గం, మెగా ఫ్యామిలీకి ఉన్న అశేష అభిమానుల‌ను దూరంగా పెట్టుకుని తాను సాధించేదేమీ లేద‌న్న స‌త్యాన్ని గ్ర‌హించిన మీద‌టే ప‌వ‌న్ త‌న పంథాను పూర్తిగా మార్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే నిన్న చెర్రీపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో పాటుగా సోద‌రుడు - వ‌దిన‌ను త‌ల్లిదండ్రుల‌తో పోల్చిన ప‌వ‌న్‌... మోగా స్టార్ ఫ్యాన్స్ అండ‌ను తిరిగి సంపాదించుకునే య‌త్నం చేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ త‌ర‌హా మార్పుతో ప‌వ‌న్ కూడా ఫక్తు పొలిటీషియ‌న్‌గానే మారిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.