Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ రాజకీయం.. అసలు కథ ఇదే..

By:  Tupaki Desk   |   2 Jan 2019 9:00 AM GMT
ప్రకాష్ రాజ్ రాజకీయం.. అసలు కథ ఇదే..
X
ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు చేసిన ప్రకటన అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ కలిసి నడిచారు. కర్ణాటకలో దేవెగౌడతో.. తమిళనాడులో స్టాలిన్ తో కలిసి చర్చలు జరిపారు. ఇలా కర్ణాటక, తమిళనాడులో ప్రకాష్ రాజ్ పరిచయాలను ఉపయోగించుకొని కేసీఆర్ లాబీయింగ్ చేశారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ అవసరం లేదు. అఖండ మెజార్టీతో గద్దెనెక్కడంతో కేసీఆర్ ను ఎవ్వరూ ఎదుర్కొనే పరిస్థితిలో కనిపించడం లేదు.

ఇక ప్రకాష్ రాజ్ టార్గెట్ ప్రస్తుతానికైతే కర్ణాటక నే కనిపిస్తోంది. స్వస్థలం కన్నడ కావడంతో ఆయన అక్కడే ఎంపీగా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు తెలంగాణ ఎన్నికల వేళ ‘13 సీట్లతో తెలంగాణలో టీడీపీ గద్దెనెక్కుతుందా.? అసలు చంద్రబాబుకు ఇక్కడేం పని’ అని ప్రకాష్ రాజ్ విమర్శించారు. దీన్ని బట్టి ప్రకాష్ రాజ్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తరుఫున ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే వైసీపీకి అయినా బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది.

ఇక భవిష్యత్ లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాలనుకుంటే ప్రకాష్ రాజ్ కీలకమవుతాడు. ప్రకాష్ రాజ్ లాంటి రైజింగ్, భావజాలం ఉన్న నేతలు ఎంతో కొంత ఉపయోగడపడుతాడని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన్ను ఫెడరల్ ఫ్రంట్ లో కీలకంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆయన ఎంపీ కల ఎక్కడి నుంచి నెరవేరుతుందనేది మాత్రం ప్రకాష్ రాజ్ సొంత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన కన్నడ నుంచే ఇండిపెండెంట్ గా పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.