Begin typing your search above and press return to search.

రాహుల్ రాజీనామా అస‌లు ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   4 July 2019 6:05 AM GMT
రాహుల్ రాజీనామా అస‌లు ప్లాన్ ఇదేనా?
X
కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీ నిర్ణ‌యం తీసుకోవ‌టం పాత వార్తే. ఇప్పుడున్న డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఏ గంట‌కు ఆ గంట అప్డేటెడ్ న్యూస్ అవ‌స‌రం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. అయితే.. రాహుల్ రాజీనామా వెనుక ఉన్న వ్యూహం ఏమిట‌న్న విష‌యం మీద మాత్రం ఆస‌క్తిక‌ర వాద‌న‌లు వినిపిస్తున్నాయి. రాజీనామా విష‌యంలో రాహుల్ ది ప‌లాయ‌వాదం అని.. త‌ప్పించుకునే త‌త్త్వంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటే.. నాయ‌కుడు అనేవాడు ఎలా ఉండాలి? క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు క‌త్తి ప‌ట్టుకొని చెల‌రేగిపోతూ.. ప్ర‌త్య‌ర్థుల్ని నిలువ‌రించాలి.. సొంత సైన్యంలో ధీమాను పెంచాలే కానీ.. రాహుల్ మాదిరి క‌త్తి కింద ప‌డేసి పారిపోకూడ‌దంటూ వ్యంగ్య‌స్త్రాలు సంధించే వారు లేక‌పోలేదు.

నిజంగానే రాహుల్ క‌త్తి కింద పారేశారా.. కాంగ్రెస్ కాడిని వ‌దిలేసి త‌న దారి తాను చూసుకున్నారా? ఛాయ్ వాలాతో తాను ఫైట్ చేయ‌లేన‌ని చేతులెత్తేశారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే అందులో నిజం లేద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు. ఛాయ్ వాలాగా త‌న‌ను తాను చెప్పుకుంటూ మోడీ వేసే ఎత్తుల‌కు కొత్త త‌ర‌హా స‌మాధానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ కున్న ఓఎస్ వెర్ష‌న్ ఏ మాత్రం స‌పోర్ట్ చేయ‌ద‌ని.. మోడీని ఎదుర్కోవ‌టానికి అప్ గ్రెడెడ్ వెర్ష‌న్ చాలా అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని రాహుల్ గుర్తించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా ఆయ‌న రాసిన లేఖ‌గా చెప్పాలి. అధికారానికి అంటిపెట్టుకొని ఉండిపోవ‌టం చాలామందికి అల‌వాటైపోయింది. అధికార కాంక్ష వీడకుండా సైద్ధాంతిక పోరాటాలు చేయ‌టం సాధ్యం కాదు. ఇలా అయితే మ‌నం ప్ర‌త్య‌ర్థుల్ని ఓడించ‌లేమంటూ ఆయ‌న పేర్కొన్న తీరు చూస్తే.. పార్టీలో ఎంత‌కూ క‌ద‌ల‌కుండా తిష్ట వేసుకున్న పాత‌త‌రం నాయ‌కుల్ని ఇంటికి పంపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని రాహుల్ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

పార్టీని రివైవ్ చేసి.. స‌రికొత్త ఓఎస్ తో అప్డేట్ చేయ‌టం ద్వారా క‌మ‌ల‌నాథుల్ని ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన శ‌క్తియుక్తుల్ని కొత్త‌గా కూడ‌గ‌ట్టుకోవాల‌న్న‌దే రాహుల్ ఆలోచ‌న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలోని 55 మంది స‌భ్యుల్లో 19 మంది 70 ఏళ్ల‌కు పైబ‌డిన‌వారు. 22 మంది 60 ఏళ్లు దాటిన వారు. అందులోనూ ఎక్కువ‌మంది 65 ఏళ్లకు పైనే వారే.

ఇలాంటి పాత బ్యాచ్ అంతా పార్టీని వ‌దిలితే త‌ప్పించి పార్టీకి కొత్త ర‌క్తాన్ని ఎక్కించే ప‌రిస్థితి లేద‌న్న విష‌యాన్ని రాహుల్ గుర్తించార‌ని.. ఆ క్ర‌మంలోనే పాత ప్లాన్ ను స‌రికొత్త‌గా తెర మీద‌కు తీసుకురానున్న‌ట్లు చెబుతున్నారు. 1963లో కామ‌రాజ్ ప్లాన్ ను రాహుల్ తాజాగా ఫాలో అవుతున్నార‌న్న మాట వినిపిస్తోంది.

కామ‌రాజ్ ప్లాన్ ప్ర‌కారం నేత‌లంతా ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి పార్టీని స‌మూలంగా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించాలి. అందులో భాగంగానే తాజా రాజీనామాలుగా చెబుత‌న్నారు. రాహుల్ పార్టీకి రాజీనామా చేసినా.. పార్టీ మీద ప‌ట్టును గాంధీ ఫ్యామిలీ మిస్ కాకుండా ఉంచుకుంటుంది. ఇంకా చెప్పాలంటే బీజేపీ-సంఘ్ మోడ్ ఎలాంటిదో కాంగ్రెస్‌-గాంధీ ఫ్యామిలీ లింకు కూడా అలానే ఉంటుంది. తెర వెనుక నిర్ణ‌యాలు తీసుకుంటూ.. కొత్త‌గా వ‌చ్చిన సార‌థి చేత పార్టీని న‌డిపిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత‌గా గాంధీ కుటుంబ విధేయుడు ఒక‌రు గ‌ద్దె మీద కూర్చొంటారు. కానీ.. దానికి సంబంధించి రిమోట్ గాంధీ ప్యామిలీ చేతిలో ఉంటుంది. ఫెయిల్ అయితే ర‌థ‌సార‌ధికి.. స‌క్సెస్ అయితే ర‌థ‌సార‌ధిని న‌డిపించే అదృశ్య హ‌స్తానికి వ‌చ్చేలా వ్యూహాన్ని డిజైన్ చేశార‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.