Begin typing your search above and press return to search.

అంత‌గా గాలిస్తుంటే.. ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ ఎందుకు కాలేదు?

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:07 AM GMT
అంత‌గా గాలిస్తుంటే.. ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ ఎందుకు కాలేదు?
X
రాజ‌కీయ నేత‌లు.. సినిమా స్టార్లు.. పోలీసులు.. వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఇలా చెప్పుకుంటూ పోతే టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ కున్న సంబంధాలు.. రిలేష‌న్లు అన్ని ఇన్ని కావు. ఇంత విస్తృతంగా నెట్ వ‌ర్క్ ఉన్న ఆయ‌న‌కు స‌రైన రీతిలో స‌ల‌హాలు ఇచ్చేవారు ఒక్క‌రు కూడా లేరా? అన్న క్వ‌శ్చ‌న్.. టీవీ9 ఎపిసోడ్ లో రాక మాన‌దు. మోసం.. ఫోర్జ‌రీ.. డేటా చౌర్యం లాంటి కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయ‌న‌.. పోలీసుల నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా దాదాపు 27రోజుల పాటు పోలీసుల క‌న్నుగ‌ప్పి తిర‌గ‌టం తెలిసిందే.

ర‌విప్ర‌కాశ్ ఆచూకీకి సంబంధించిన స‌మాచారం పోలీసుల ద‌గ్గ‌ర ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న్ను అరెస్ట్ చేయలేద‌న్న మాట పోలీసు వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న 30 సిమ్ లు మార్చిన‌ట్లుగా పోలీసులు గుర్తించ‌టం అంటే.. ఆయ‌న ఆచూకీకి సంబంధించిన స‌మాచారం తెలిసిన‌ట్లే. అంతేకాదు.. ఏపీలోని రిసార్ట్ లో ఉన్న‌ట్లు.. ఆ త‌ర్వాత ముంబై.. అనంత‌రం బెంగ‌ళూరు వెళ్లిన విష‌యాన్ని సైబ‌రాబాద్ పోలీసులు గుర్తించారంటే.. ర‌విప్ర‌కాశ్ క‌ద‌లిక‌ల మీద పోలీసుల‌కు స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తున్న‌ట్లే.

పోలీసుల నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా.. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకు తిరుగుతున్న ఆయ‌న్ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా క‌నిపించ‌కుండా పోయిన ర‌విప్ర‌కాశ్ ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌త్యేక బృందాల్ని ఏర్పాటు చేసి.. ఇత‌ర రాష్ట్రాల‌కు పంపారు. అంటే.. ఒక‌వైపు పోలీసు బృందాలు ఆయ‌న్ను వెతికేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటి వేళ‌.. ఆయ‌న అరెస్ట్ కావాల్సి ఉన్నా అరెస్ట్ కాలేదు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. పోలీసుల‌కు క‌నిపించ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న ర‌విప్ర‌కాశ్.. మంగ‌ళ‌వారం సాయంత్రం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు వ‌చ్చే స‌మ‌యానికి కొద్దిమంది మీడియా ఛాన‌ల్స్ కు చెందిన రిపోర్ట‌ర్లు.. కెమేరా మెన్లు సిద్ధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు ర‌విప్రకాశ్ రానున్న విష‌యం మీడియా సిబ్బందికి తెలిసిందంటే.. పోలీసుల‌కు తెలీకుండా ఉంటుందా? అందులోకి ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ ను స‌వాలుగా తీసుకొని వెతుకుతున్న పోలీసులు.. ఆయ‌న ఆచూకీ ల‌భించిన వెంట‌నే ఆయ‌న్ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ర‌విప్ర‌కాశ్ ను హ‌డావుడిగా అరెస్ట్ చేయాల‌ని.. ఆయ‌న్ను జైలుకు పంపాల‌న్న తొంద‌ర తెలంగాణ పోలీసుల‌కు లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌న వ్యాపార భాగ‌స్వాములతో ఆయ‌న‌కున్న విభేదాల్ని.. ఆ కోణంలోనే చూడాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న పోలీసుల తీరే.. ఆయన్ను అరెస్ట్ చేయ‌లేదంటున్నారు. ర‌విప్రకాశ్ అరెస్ట్ విష‌యంలో పోలీసులే కాదు.. అధికార‌వ‌ర్గం కూడా అతృత‌గా లేద‌న్న మాట వినిపిస్తోంది. పోలీసుల వ‌ద్ద‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో.. ఆయ‌న రాక‌ నాలుగైదు రోజుల ఆల‌స్య‌మే త‌ప్పించి అస‌లు రాకుండా ఉండే ఛాన్స్ లేదు.

అందుకే.. ఆయ‌న‌కు ఇవ్వాల్సిన అవ‌కాశాలు అన్ని ఇవ్వాల‌న్న ఉద్దేశంతో పోలీసు ఉన్న‌తాధికారులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే ర‌విప్ర‌కాశ్ కు మ‌ద్ద‌తుగా మీడియాలోనే కాదు సోష‌ల్ మీడియాలోనూ ఎలాంటి సానుకూల‌త లేక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.ఇలాంటి నేప‌థ్యంలో ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్లుగా క‌నిపించ‌కూడ‌ద‌న్న భావ‌న‌తో పోలీసు వ‌ర్గాలు ఉన్నాయి.

దీంతో.. ఆయ‌న అరెస్ట్ కాకుండా ఉండ‌ట‌మే కాదు.. పోలీసుల‌కు స‌మాచారం అందించి మ‌రీ విచార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ర‌విప్ర‌కాశ్ ను హ‌డావుడిగా అరెస్ట్ చేసి.. జైలుకు పంపాల‌న్న ఆలోచ‌న‌లో సైబ‌రాబాద్ పోలీసులు లేర‌న్న విష‌యాన్ని గుర్తించి.. తాజా విచార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లుగా చెప్పాలి. నిజానికి.. ఆయ‌న‌కు అంత‌కు మించిన ఆప్ష‌న్ కూడా లేక‌పోవ‌టంతో రాక త‌ప్ప‌లేదంటున్నారు. అదేదో మొద‌టే చేసి ఉంటే.. పోలీసుల క‌ళ్లు గ‌ప్పి త‌ప్పించుకు తిరుగుతున్న ర‌విప్ర‌కాశ్ లాంటి ఇమేజ్ రాకుండే ఉండేది.