Begin typing your search above and press return to search.

రోజా ఆల‌యాల సంద‌ర్శ‌న వెనుక అస‌లు కార‌ణ‌మిదేనా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 10:52 AM GMT
రోజా ఆల‌యాల సంద‌ర్శ‌న వెనుక అస‌లు కార‌ణ‌మిదేనా?
X
జీవితంలో ఒక్క‌సారైనా మంత్రి కావాల‌నే త‌న ల‌క్ష్యాన్ని వైఎస్ జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చేరుకున్నారు.. ఆర్కే రోజా. ప‌ర్యాట‌క‌, యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడా శాఖ మంత్రిగా చాన్సు కొట్టేశారు. ఇందుకు సామాజిక స‌మీక‌ర‌ణాలు క‌లిసి రాక‌పోయినా.. పార్టీకి ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాకు జ‌గ‌న్ మంత్రిగా చాన్సు ఇచ్చారు.

మంత్రి అయిన ద‌గ్గ‌ర నుంచి రోజా త‌రచూ ఏదో ఒక ఆల‌యంలో ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నారు. ఎక్కువ రోజులు ఆల‌యాల్లోనే గ‌డుపుతున్నారు. ఆమె మంత్రి కాక‌ముందు ఈ స్థాయిలో ఆమె ఏ దేవాల‌యంలోనూ ద‌ర్శ‌నాల‌కు వ‌చ్చింది లేదు. అప్పుడ‌ప్పుడు తిరుప‌తి మాత్ర‌మే వెళ్తుండేవారు.

అలాంటి రోజా మంత్రి కాగానే త‌న ట్రాక్ మార్చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌ముఖ ఆల‌యాలు, పీఠాల‌ను ఆమె సంద‌ర్శిస్తున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. అందులోనూ ఆమె ప‌ర్యాట‌క శాఖ మంత్రి కావ‌డంతో స‌హ‌జంగానే ఆయా ప్రాంతాల్లో ప‌ర్యాట‌కాభివృద్ధి కోసం ఆ దేవాల‌యాల‌ను సంద‌ర్శించ‌డం, అధికారుల‌తో స‌మీక్షించ‌డం వంటివి రోజా చేస్తున్నారు.

మ‌రోవైపు మంత్రి కాక ముందు ఆమె ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ తోపాటు ప‌లు టీవీ షోల్లో హ‌ల్చ‌ల్ చేసేవారు. అందువ‌ల్ల ఆమెకు పెద్ద‌గా స‌మ‌యం ఉండేది కాదు. ఎక్కువ కాలం హైద‌రాబాద్‌లోనే ఉండేవారు. ఇక అప్పుడప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌నిలో ప‌నిగా తిరుమ‌ల‌లో స్వామివారిని ద‌ర్శించుకునేవారు. మంత్రి అయ్యాక జ‌బ‌ర్ద‌స్త్‌తో స‌హా అన్ని టీవీ షోల‌కు రోజా దూర‌మైన సంగ‌తి తెల‌సిందే. దీంతో ఆమె మంత్రిగా రాష్ట్రంలోనే తిరిగే అవ‌కాశం ల‌భించింది. దీంతో త‌న స‌మ‌యాన్ని దేవాల‌యాల సంద‌ర్శ‌న‌కు వినియోగిస్తున్నార‌ని చెబుతున్నారు.

తాజాగా విశాఖ‌ప‌ట్నంలోని శ్రీ శారదాపీఠాన్ని రోజా సందర్శించారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అక్క‌డ‌ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. శారదా పీఠంలో జ‌రుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నాన‌న్నారు. ప్రతి రోజూ ఏదొక జిల్లాలో అక్కడున్న అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతున్నాన‌ని రోజా తెలిపారు.

అంతేకాకుండా పెద్దవాళ్లు చెప్పినట్లు.. ఎక్కడ పూజలు చేస్తామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంద‌ని తెలిపారు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నచోటికి వెళ్తే అన్నీ పాజిటివ్ ఆలోచనలు వస్తాయన్నారు. ఎవరైనా నెగిటివ్‌గా ఆలోచించినా, ఏవైనా చేసినా అవ‌న్నీ పోతాయ‌ని అభిప్రాయపడ్డారు.

మనం దేన్నీ కోరుకోవాల్సిన అవసరం లేద‌ని రోజా చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో, మంచి ఆలోచనా శక్తితో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. అందుకే ఆలయాల సంద‌ర్శ‌న‌కు వెళ్తాన‌ని తెలిపారు. హోమాలు జరిగే చోటికి వెళతానని చెప్పారు. పాజిటివ్ ఎనర్జీ కోసమే ఆలయాలకు వెళతానని వెల్ల‌డించారు.

సినిమాల్లో, రాజకీయాల్లో శత్రువులు, నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి ఉంటుంద‌ని రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవన్నీ పోయి ఉత్సాహంగా పనిచేయాలంటే భగవంతుడి ఆశీస్సులు కావాల్సిందేన‌ని రోజా తేల్చిచెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.