Begin typing your search above and press return to search.

దింపుడు కళ్లేం ఆశలో కాంగ్రెస్

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:35 AM GMT
దింపుడు కళ్లేం ఆశలో కాంగ్రెస్
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. 13 రోజులలో పాలకులు ఎవరో ప్రతిపక్షం ఎవరిదో ప్రజలు నిర్ణయించనున్నారు. నామినేషన్లు ఉపసంహరణ - బుజ్జగింపులు - బెదిరింపులు పూర్తైయ్యాయి. ఇక మిగిలింది సమరమే. మహాకూటమిలో ప్రధాన పార్టీయైన కాంగ్రెస్ తమ అగ్రనేతలను రంగంలోకి దింపింది. పార్టీ జాతీయాధ్యక్షడు రాహుల్ గాంధీ - అహ్మద్ పటేల్ - గులాంనాబి ఆజాద్ - జైపాల్‌ రెడ్డి - జైరాం రమేష్ - చిదంబరం వంటి దిగ్గజాలను ప్రచార బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీ తర్వాత అంతటి విశిష్టత ఉన్న నాయకులరాలు సోనియా గాంధీని ప్రచారానికి తీసుకు వచ్చారు. తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగానే ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి చేరువుగా ఉందని సర్వేలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందుకోసం అగ్రనేతలందరిని ఎన్నికల బరిలోకి దింపింది. రానున్న 13 రోజులు కాంగ్రెస్ పార్టీకి జీవన మరణ సమస్యగా మారింది. ఈ ఎన్నికలలో విజయం దక్కితీరాలన్న కసి కాంగ్రెస్ శ్రేణులలో కనిపిస్తోంది.

తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు లోక్‌ సభ మాజీ అధ్యక్షుడు లగడపాటి రాజ్‌ గోపాల్ చేసిన సర్వేలో కాంగ్రెస్‌ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, తేలడంతో కాంగ్రెస్ పార్టీ దింపుడు కళ్లేం ఆశతో ప్రచార బరిలో దిగింది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను మోహరించి విజయమే పరమావధిగా వ్యూహరచన చేస్తోంది. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజలలో సానుకూలత వ్యక్తమవుతుండడంతో కాంగ్రస్ శ్రేణులకు ఎదురు దెబ్బ తప్పదేమోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు సంవత్సాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న సోనియా గాంధీని శైతం ప్రచారానికి తీసుకు రావడం వెనుక ఓటమి భయం ఉందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత ఉన్న తెలుగుదేశంతో కలవడం వల్ల ఆ పార్టీపట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. అయిన విజయం వరిస్తుందేమో అన్న ఆశ చావడం లేదు. మహాకూటమి అభ్యర్దులు ఈ దింపుడు కళ్లేం ఆశతోనే ప్రచారానికి వెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.