Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాల్లో ప్ర‌చారానికి సోనియా ఎందుకు వెళ్ల‌ట్లేదు?

By:  Tupaki Desk   |   23 Nov 2018 7:51 AM GMT
ఆ రాష్ట్రాల్లో ప్ర‌చారానికి సోనియా ఎందుకు వెళ్ల‌ట్లేదు?
X
తెలంగాణ‌లో సోనియా గాంధీ ప‌ర్య‌ట‌న‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. నేటి సాయంత్రం మేడ్చ‌ల్‌ లో జ‌ర‌గ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్ర‌సంగించ‌నున్నారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. మ‌హా కూట‌మి టికెట్ల పంప‌కాలు తేల‌క ఇన్నాళ్లూ ప్ర‌చారంలో కాస్త వెనుక‌బ‌డిన‌ట్లు భావిస్తున్న టీపీసీసీ నేత‌లు.. సోనియా రాక‌తో త‌మ‌లో జోష్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. అధినేత్రి స‌భ త‌ర్వాత ఇక ప్ర‌చారంలో దూసుకెళ్ల‌వ‌చ్చున‌ని యోచిస్తున్నారు.

అయితే - సోనియా తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప‌లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. మ‌రో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో రెండు ద‌శ‌ల పోలింగ్ ఇటీవ‌లే ముగిసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - మిజోరంల‌లో ఈ నెల 28న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక తెలంగాణ‌తోపాటు రాజ‌స్థాన్‌ లో వ‌చ్చే నెల 7న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా.. యూపీఏ ఛైర్‌ ప‌ర్స‌న్ సోనియా గాంధీ మాత్రం తెలంగాణలో ప్ర‌చారానికే మొగ్గుచూపారు. ఇటీవ‌లే ఎన్నిక‌లు ముగిసిన ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో ప్ర‌చారానికి ఆమె వెళ్లేలేదు. మిజోరం - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ల్లో ఎన్నిక‌ల‌కు వారం రోజులు కూడా గ‌డువు లేదు. అయినా అక్క‌డికి వెళ్ల‌ట్లేదు. కాంగ్రెస్‌ కు మంచి ప‌ట్టున్న రాజ‌స్థాన్‌ లో ప్ర‌చారానికీ సోనియా ఆస‌క్తి చూప‌ట్లేదు. ఆమె ఫోకస్ కేవ‌లం తెలంగాణ‌పైనే ఉంది. అందుకే టీపీసీసీ నేత‌లు అడిగిన వెంట‌నే ప్ర‌చారానికి ఒప్పుకున్నారు. నేడు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు.

తెలంగాణ‌కు సోనియా ప్రాధాన్య‌మివ్వ‌డం వెనుక ప‌లు కార‌ణాల‌ను విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అందులో ప్ర‌ధాన‌మైన కార‌ణం.. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసింది సోనియానే కావ‌డం. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ ఎస్ స‌హా ప‌లు పార్టీలు పోరాటం చేశాయి. ప‌లువురు ఉద్య‌మ‌కారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే - అంద‌రి ఆకాంక్ష‌ల‌ను గౌర‌వించి రాష్ట్రాన్ని అందించింది మాత్రం యూపీఏనే. అందులో సోనియాది కీల‌క పాత్ర‌. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్‌ తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిసీ ఆమె వెన‌క్కు త‌గ్గ‌లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ మేర‌కు ఆమెపై తెలంగాణ‌వాసుల్లో ఆద‌ర‌ణ ఉంది.

ఇక తెలంగాణ ఆవిర్భ‌వించాక ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి సోనియా రానే లేదు. తొలిసారిగా ఇక్క‌డికి వ‌చ్చి.. నాడు రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను స్వ‌యంగా వివ‌రిస్తే తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవ‌కాశాలు లేక‌పోలేదు. అందుకే టీపీసీసీ నేత‌లు ఆమె రాక కోసం ప‌ట్టుబ‌ట్టారు.

సోనియా ఇత‌ర రాష్ట్రాల‌పై దృష్టి సారించ‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణాన్ని కూడా విశ్లేష‌కులు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 70 దాటింది. త‌ర‌చూ అనారోగ్యం పాల‌వుతున్నారు. అమెరికా వెళ్లి మ‌రీ చికిత్స తీసుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌క‌పోవ‌డ‌మే మేల‌ని వైద్యులు ఆమెకు సూచించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు సోనియా ప్ర‌చారానికి వెళ్ల‌లేదు. కుమారుడు రాహుల్ గాంధీయే ఆయా రాష్ట్రాల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను పూర్తిగా భుజాల‌కెత్తుకున్నారు.