Begin typing your search above and press return to search.

సుజనా వారి సూక్తి ముక్తావళి.. ఈడీ ఎఫెక్టేనా... ?

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:36 AM GMT
సుజనా వారి సూక్తి ముక్తావళి.. ఈడీ ఎఫెక్టేనా... ?
X
యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న నాయకుడు.. చంద్రబాబు చలవతో కేంద్రంలో మంత్రిగా చక్రంతిప్పిన ప్రముఖ వ్యాపార వేత్త.. ఇప్పుడు అదే చంద్రబాబుకు సూక్తి ముక్తావళిని బోధిస్తున్నారు. పిల్లి మంచిదైతే.. ఎలుక తోకాడించిందన్నట్టుగా సుజనావారు రాజకీయాల గురించి.. ఏపీ బాగోగుల గురించి చంద్రబాబుకు క్లాస్‌ పీకుతున్నారు. వరుసగా రెండు సార్లు టీడీపీ తరఫున రాజ్యసభకు ఆయన నామినేట్‌ అయ్యారు. ఈ క్రమంలోనే నాలుగేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం - తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు కూడా కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన స్పందించారు. ఏగూటి చిలుక ఆగూటి పలుకులే పలుకుతుందన్నట్టుగా.. ఏపీలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం బాబుకు ఎఫెక్ట్‌ కొట్టిందని ఆయన సెలవిచ్చారు. మరి అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న బాబు డిమాండ్‌ ను సుజనా వారు ఎందుకు పక్కన పెట్టారో ఆయనకే తెలియాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. అయితే - ఎన్నికలు ముగిసి - జగన్‌ ప్రభుత్వం ఏర్పడిపోయిన తర్వాత సుజనావారు ఇప్పుడు టీడీపీపై స్పందించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, సుజనా వారి సూక్తి ముక్తావళిని పరిశీలిస్తే.. బాబుకు ఏమీ తెలియదని - తాను బీజేపీతో తెగదెంపులు చేసుకోవద్దని చెప్పినా ఆయన వినలేదని చెప్పుకొచ్చారు. ఇది తనకు నచ్చకనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు సుజనా వారు వివరించారు.

అయితే, సుజనా సెలవిచ్చినట్టు ఆయన బీజేపీలోకి చేరేందుకు బీజేపీతో చంద్రబాబు కటీఫ్‌ కారణం ఎంత మాత్రం కాదని అంటున్నారు. నిజానికి సుజనా కేంద్ర మంత్రిగా పదివికి రాజీనామా చేసిన తర్వాత ఆయనపై ఈడీ - సీబీఐ దృష్టి సారించాయి. ఆయన వ్యాపారానికి సంబంధించి ఐటీ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఒకానొక దశలో సుజనా పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆయన ఈ బాధలను తప్పించుకునే క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సాగిలపడ్డారనే ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, దీనికి మసిపూసి మారేడు చేసేందుకు సుజనా వారు ఇప్పుడు.. తాను బీజేపీలోకి చేరడానికి గల కారణానికి బీజేపీతో టీడీపీ వైరం పెట్టుకోవడమేనని చెప్పడం ద్వారా సాధించేది శూన్యమని అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.